ధాన్యం కొనుగోళ్లు స్పీడప్​ చేయాలి : కలెక్లర్​ క్రాంతి వల్లూరు

ధాన్యం కొనుగోళ్లు స్పీడప్​ చేయాలి :  కలెక్లర్​ క్రాంతి వల్లూరు

జోగిపేట, వెలుగు : ధాన్యం కొనుగోళ్లు స్పీడప్​ చేయాలని కలెక్టర్​ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె ఆందోల్​ మండలంలోని కన్​సాన్​పల్లి, సంగుపేట  కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అనంతరం నేరుగా రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందని రైతులు ఆమె దృష్టికి తీసుకురాగా మిల్లుల వద్ద ధాన్యం త్వరగా అన్ లోడ్ చేయించాలని  సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు.

అకాల వర్షాలు పడుతున్నందున కొనుగోలు వేగవంతం చేసి, ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. చివరి గింజ వరకూ  ధాన్యం  కొనుగోలు చేయాలని  సెంటర్ ఇన్​చార్జిలకు సూచనలు జారీచేశారు. గన్నీబ్యాగ్ల సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. మిల్లులకు ఇచ్చిన కెపాసిటీని పూర్తి చేయాలన్నారు. 

హెచ్​ఎంకు షోకాజ్​ నోటీస్​

అమ్మ ఆదర్శ స్కూళ్ల ప్రోగ్రామ్​లో భాగంగా అన్నాసాగర్​,  ఆందోల్​లోని బాలుర, బాలికల ఉన్నత స్కూళ్లను కలెక్లర్​ తనిఖీ చేశారు. బాలికల స్కూల్​లో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో హెచ్​ఎంకు షోకాజ్​ నోటీసు జారీ చేయాలని డీఈవోను ఆదేశించారు.  కలెక్టర్​వెంట సివిల్ సప్లై జిల్లా మేనేజరు కొండల్ రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి వనజాత, మెప్మా పీడీ గీత, ఆర్డీవో  పాండు, సంబంధిత అధికారులు  పాల్గొన్నారు. 

భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

పటాన్​చెరు : ఈవీఎంలను స్టోర్​చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్  క్రాంతి సూచించారు. రుద్రారం గీతం యూనివర్సిటీ కాలేజ్​లో స్ట్రాంగ్ రూమ్ ల్లో  భద్రపరిచిన  నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ,  జుక్కల్  అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలించారు. కార్యక్రమంలో నిమ్జ్  ప్రత్యేకాధికారి రవీందర్ రెడ్డి , సర్వేయర్ కోటేశ్వరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.