
సంగారెడ్డి టౌన్, వెలుగు: వచ్చే పార్లమెంట్ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి పెట్టాలని కలెక్టర్ క్రాంతి అధికారులకు సూచించారు. గురువారం ఆమె సంగారెడ్డి కలెక్టర్ఆఫీసులో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పై మొదటి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్ , జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సెక్టార్ అధికారులు, పీవోలు, ఏపీవోలు, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టికల్ సర్వేలేన్స్, వీడియో సర్వేలెన్స్, వీడియో వ్యూయింగ్ బృందాలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు.
వివిధ బృందాలకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, విధులు, ఏర్పాట్లు, తదితర విషయాలపై జిల్లా స్థాయి ట్రైనర్ కృష్ణ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, డీఎండబ్ల్యూవో దేవుజా, ఆర్డీవోలు రవీందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రాజు, పాండు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.