లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ప్రొసీడింగ్స్​ అందించాలి : కలెక్టర్​ క్రాంతి

లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ప్రొసీడింగ్స్​ అందించాలి : కలెక్టర్​ క్రాంతి
  • మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకొని పథకాలను ప్రారంభించాలి

సంగారెడ్డి, వెలుగు: మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకొని అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ప్రొసీడింగ్స్​ అందించాలని కలెక్టర్​క్రాంతి అధికారులను ఆదేశించారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. పథకాల పంపిణీలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. ముందుగా సీఎం సందేశంతో కూడిన వీడియోను ప్రదర్శించాలన్నారు. 

ఆహార భద్రత కార్డులకు తహసీల్దార్ నేతృత్వంలో, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఎంపీడీవో ఆధ్వర్యంలో, రైతు భరోసాకు ఏవో నేతృత్వంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏపీవో ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమించాలని సూచించారు. లబ్ధిదారుల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్​లో అడిషనల్​ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.