
సంగారెడ్డి టౌన్, వెలుగు: ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కలెక్టర్ క్రాంతి ఓటరుచైతన్య రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు ప్రచార రథం 22న సంగారెడ్డి నుంచి ఆందోల్, నారాయణఖేడ్ కు చేరుతుందన్నారు. 23న జహీరాబాద్ కు 24న పటాన్చెరుకు వెళుతుందన్నారు. అనంతరం 25న జిల్లా కేంద్రంలో నిర్వహించే జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటుందని వెల్లడించారు.
తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఓటు హక్కు వినియోగించుకోవడంపై కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. అనంతరం ఓటర్ జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ ఈనెల 20, 21 తేదీల్లో నిర్వహించగా మంచి స్పందన లభించిందన్నారు. జిల్లాలోని 1594 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన శిబిరాల ద్వారా ఫారం -6( 4509 ), ఫారం -7 (924), ఫారం -8 (1653) అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్ఓ నగేశ్, జిల్లా అధికారులు, ఎన్నికల విభాగపు అధికారులు పాల్గొన్నారు.