సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో సమగ్ర సర్వే సజావుగా సాగుతోందని, ప్రజలందరూ సహకరిస్తున్నారని, 75% సర్వే పూర్తయిందని కలెక్టర్ క్రాంతి తెలిపారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని 32 వార్డుల్లో సర్వే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమగ్ర సర్వే ఉద్దేశం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ అవకాశాలను కల్పించడానికే అన్నారు.
సర్వేను నిర్దేశిత కాలపరిమితిలోనే పూర్తి చేయాలని సూచించారు. ఈ సర్వే వల్ల ప్రభుత్వానికి సమగ్రమైన డేటాలభిస్తుందని, తద్వారా కొత్త ప్రణాళికల రూపకల్పనకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలనే సంకల్పంతో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్, తహసీల్దార్ దేవదాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ లో పరిశుభ్రత పాటించాలి
కలెక్టరేట్ లో పరిశుభ్రత పాటించాలని కలెక్టర్క్రాంతి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ ప్రాంగణం మొత్తం తిరిగి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కలెక్టరేట్ కాంప్లెక్స్ లో శుభ్రత లోపిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడక నిషేధం కచ్చితంగా అమలు చేయాలన్నారు. ప్రజలకు తాగునీటి కోసం ఫిల్టర్ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.
కలెక్టరేట్ మెయింటెనెన్స్ చార్జెస్ ను అధికారులు ఎప్పటికప్పుడు చెల్లించాలన్నారు. కలెక్టరేట్ కు వచ్చే వాహనాలు క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఏవో పరమేశ్ ను ఆదేశించారు . ప్రైవేట్ వ్యక్తులు తమ వాహనాలను అధికారుల పార్కింగ్‌లో పెట్టకుండా చూడాలని సెక్యూరిటీస్ సిబ్బందిని ఆదేశించారు. అధికారుల వాహనాల కు స్టిక్కర్స్ వేయించాలని సూచించారు. నో పార్కింగ్ జోన్ లో వాహనాలు పెట్టి వెళ్లిపొతే జరిమానా విధించాలని కలెక్టరేట్ ఏవో ను ఆదేశించారు.