భూభారతితో పక్కాగా హద్దులు : కలెక్టర్​ క్రాంతి

భూభారతితో పక్కాగా హద్దులు : కలెక్టర్​ క్రాంతి

ఝరాసంగం/న్యాల్​కల్, వెలుగు:  భూభారతితో కమతాలకు పక్కాగా హద్దులు నిర్ణయిస్తారని కలెక్టర్​క్రాంతి అన్నారు. శుక్రవారం ఆమె ఝరాసంగం, న్యాల్​కల్, కోహీర్​ మండల కేంద్రంలో  భూభారతి చట్టంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో అడిషనల్​కలెక్టర్​మాధురితో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్​ పవర్​పాయింట్​ప్రజెంటేషన్​ద్వారా చట్టంలోని వివరాలను తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ..భూభారతితో తొంబై శాతం భూసమస్యలు మండల స్థాయిలోనే పరిష్కారమవుతాయన్నారు. రైతులు భూసమస్యలపై సివిల్​కోర్టులకు వెళ్లకుండా రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేసి పేద రైతులకు ఉచిత న్యాయ సాయం అందిస్తుందన్నారు. అప్పీల్​కు వెళ్లడానికి ల్యాండ్​ ట్రిబ్యునల్​ ఏర్పాటు చేసిందన్నారు. భూరికార్డుల్లో తప్పుల సవరణకు రైతులు పోర్టల్​లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

ఇందిరమ్మ ఇండ్లు బేస్​మెంట్​పూర్తిచేసిన లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొనింటి మాణిక్​రావు,సెట్విన్​ కార్పొరేషన్​ చైర్మన్​గిరిధర్​రెడ్డి, ఉమ్మడి మెదక్​ జిల్లా డీసీఎంఎస్​ చైర్మన్​ శివకుమార్, ఆర్డీవో రాంరెడ్డి, తహసీల్దార్​తిరుమల్​రావు, డీటీ కరుణాకర్​రావు, నాయకులు హన్మంత్​రావు పాటిల్, భాస్కర్​రెడ్డి, శ్రీనివాస్​రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

భూభారతితో  రైతులకు మేలు: కలెక్టర్ మనుచౌదరి

చేర్యాల: భూభారతి చట్టంతో రైతులకు మేలు జరగనుందని కలెక్టర్​మనుచౌదరి అన్నారు. శుక్రవారం ఆయన ధూల్మిట్ట, మద్దూరు, చేర్యాలలో  నిర్వహించిన భూభారతి  అవగాహన సదస్సుల్లో పాల్గొని మాట్లాడారు. సాదా బైనామాల గురించి ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలను విడుదల చేస్తుందన్నారు. వారసత్వ సమస్యలపై ఇరు వర్గాలను పిలిపించి డాక్యుమెంట్ వెరిఫై చేసి నిర్ణీత కాల వ్యవధిలో సమస్యను పరిష్కరించే అవకాశం ఈ చట్టంలో కల్పించారన్నారు. 

మనిషికి ఆధార్ లాగే  భూమికి భూదార్ కార్డ్ ఇస్తామని,  భూమి హద్దులు జీపీఆర్ఎస్ లో పొందుపరచడం వల్ల ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చన్నారు. ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు భూ సమస్యలపై అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందన్నారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రైతులకు అన్ని వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీవో  రామ్మూర్తి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్ రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ---------