
సంగారెడ్డి టౌన్, పుల్కల్, వెలుగు: భూభారతితో సాదాబైనామాలకు శాశ్వత పరిష్కారం లభించనుందని కలెక్టర్క్రాంతి అన్నారు. బుధవారం కంది మండలంలోని రైతు వేదికలో, చౌటకూర్ మండలంలోని జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన రెవెన్యూ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. భూభారతి చట్టం ద్వారా పక్కాగా భూ సరిహద్దులు నిర్ణయిస్తారని, ప్రజలందరికీ ఉచిత న్యాయ సాయం అందుబాటులో ఉంటుందన్నారు. రైతులకు వారి భూములపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు అనేక కొత్త అంశాలను ఇందులో పొందుపరిచారన్నారు. అనంతరం భూభారతి చట్టంలోని వివరాల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు.
అనంతరం కంది మండలంలోని బాలికల ప్రాథమిక స్కూల్‌ను సందర్శించి కొత్త గా నిర్మించిన అదనపు గదులను పరిశీలించారు. స్టూడెంట్స్ సంఖ్య పెంచాలని టీచర్లకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో డీఏవో శివప్రసాద్, ఆర్డీవోలు రవీందర్ రెడ్డి, పాండు, తహసీల్దార్ అనుదీప్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నత్తి దశరత్, రైతు సంఘం నాయకులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
భూభారతి చట్టంతో ఆప్పీల్ కు అవకాశం: కలెక్టర్ మనుచౌదరి
సిద్దిపేట రూరల్: భూభారతి చట్టం ప్రకారం అధికారులు అందించిన ఆర్డర్లపై సంతృప్తి చెందకుంటే బాధితులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. రూరల్ మండలంలోని రాఘవాపూర్ రైతు వేదిక వద్ద నిర్వహించిన అవగాహన సదస్సులో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి పాల్గొన్నారు. ముందుగా భూభారతి చట్టంలోని వివిధ అంశాల గురించి అడిషనల్ కలెక్టర్ రైతులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు ద్వారా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుకు వెళ్లవచ్చని, దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాను ప్రభుత్వం అందిస్తుందన్నారు. వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్విచారణ జరిపి రికార్డుల్లో మ్యూటేషన్ చేస్తారని, నిర్ణీత గడువు లోగా పూర్తి చేయకుంటే ఆటోమేటిక్ గా మ్యూటేషన్ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సదానందం, జడ్పీ సీఈవో రమేశ్, తహసీల్దార్ వెంకటేశ్, ఆర్టీఏ మెంబర్ సూర్యవర్మ, అంజిరెడ్డి పాల్గొన్నారు.
భూభారతి చట్టంతో రైతులకు మేలు: అడిషనల్కలెక్టర్
బెజ్జంకి: భూభారతి చట్టంతో రైతులకు మేలు జరగనుందని అడిషనల్కలెక్టర్అబ్దుల్హమీద్అన్నారు.మండల కేంద్రంలో ఫ్యాక్స్ ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ ధరణి పోర్టల్ తో మండల స్థాయి, డివిజనల్ స్థాయి అధికారులు నిర్ణయం తీసుకునే అధికారం లేదని సీసీఎల్ తోనే సమస్యలు పరిష్కారం కాలేక రైతులకు ఇబ్బంది ఎదుర్కొన్నారన్నారు. భూభారతి చట్టంతో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. సమావేశంలో ఆర్డీవో సదానందం, ఫ్యాక్స్ చైర్మన్ శరత్ రావు, ఏఎంసీ చైర్మన్ కృష్ణ, వైస్ చైర్మన్ రమేశ్, శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, ఏవో సంతోష్ పాల్గొన్నారు.