వేసవి  యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి : వల్లూరు క్రాంతి 

వేసవి  యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి : వల్లూరు క్రాంతి 

సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలో తాగునీటి ఎద్దటి రాకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్​ క్రాంతి  అధికారులకు సూచించారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్​లో​ ఆర్​డబ్ల్యూఎస్​, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్,  గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  గ్రామాల్లో,  పట్టణాల్లో తాగునీటి సమస్యల పరిష్కారం  కోసం కలెక్టరేట్​లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే  08455 276155 కు ఫోన్ చేస్తే వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తారని పేర్కొన్నారు.

ఉపాధి హామీ పని జరిగే ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యంతో పాటు నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.    మూగజీవాలకు తాగునీటి  సౌకర్యం, హరితహారంలో నాటే మొక్కలకు షెడ్లను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలు, అడవుల్లో  చెట్లను నరికి నిప్పు పెట్టే  వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ చంద్రశేఖర్, మిషన్ భగీరథ్ ఎస్ఈ రఘువీర్, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డీఆర్డీవో జ్యోతి, డీపీవో సాయిబాబా, మిషన్  భగీరథ అధికారులు, మునిసిపల్  కమిషనర్లు, ఎంపీవోలు పాల్గొన్నారు.