విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు : సీవోఈలో బస చేసిన కలెక్టర్

విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు : సీవోఈలో బస చేసిన కలెక్టర్

బెల్లంపల్లి/ నస్పూర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం రాత్రి బెల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలుర సీవోఈ పాఠశాల‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్లాస్​రూమ్​లు, కిచెన్, ఆర్‌ఓ ప్లాంట్, టాయిలెట్ బ్లాక్‌లను పరిశీలిం చారు. స్కూల్​ను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని ప్రిన్సిపాల్ డి.శ్రీధర్‌ను ఆదేశించారు. కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పోషక విలువలతో కూడిన భోజనం అందజేయాలన్నారు. క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, టెన్త్​ ఎగ్జామ్స్ సమీపిస్తున్నందున ఏకాగ్రతతో చదవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి వసతి గృహంలో బస చేశారు. కలెక్టర్ వెంట బెల్లంపల్లి ఆర్డీవో పి.హరికృష్ణ తదితరులు ఉన్నారు.

బాలల సంరక్షణపై ప్రత్యేక దృష్టి 

బాలల సంరక్షణకు ప్రత్యేక దృష్టి పెట్టి సమన్వయంతో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్ మండల కేంద్రంలోని బాలసదనం భవనం నిర్మాణానికి డీసీపీ, ఎ.భాస్కర్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్ ​రావు, జిల్లా సంక్షేమశాఖ అధికారి రౌఫ్​ ఖాన్​తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బాలల సంరక్షణ దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రూ.కోటి 34 లక్షల మిషన్ వాత్సల్య నిధులతో బాల సదనం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు. మహిళలు, పిల్లల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.