- జిల్లాలో 3.29 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
- 326 సెంటర్ల ఏర్పాటుకు ప్రపోజల్స్
మంచిర్యాల, వెలుగు: వానాకాలం ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) సబావత్ మోతీలాల్‌తో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో వరిధాన్యం సేకరణపై కలెక్టరేట్లో రివ్యూ నిర్వహించారు. జిల్లాలో 3 లక్షల 29 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామని.. ఇందులో సన్నాలు 2 లక్షల 16 వేల మెట్రిక్ టన్నులు, దొడ్డు రకాలు లక్షా 13 వేల 760 మెట్రిక్ టన్నుల దిగుబడి రానుందన్నారు. డీఆర్డీఏ, ప్యాక్స్, డీసీఎమ్మెస్ఆధ్వర్యంలో 326 సెంటర్లు ఏర్పాటుకు ప్రపోజల్స్పంపినట్లు చెప్పారు. ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ప్రకటించడంతో ఈ రకం ధాన్యం అధికంగా వచ్చే అవకాశం ఉంద న్నారు.
సెంటర్ల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. 82 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా 21 లక్షలు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన వాటిని సమకూర్చుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 10 రా రైస్ మిల్లులు, 19 పారా బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయని, వాటి కెపాసిటీ మేరకే ధాన్యం కేటాయించాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి ధాన్యం రాకుండా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని రైస్ మిల్లులకు కేటాయించిన సీఎమ్మార్టార్గెట్ను ఈ నెల 30లోగా పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహించిన మిల్లర్లపై యాక్షన్తీసుకోవాలని కలెక్టర్ఆదేశించారు. డీసీఎస్వో బ్రహ్మారావు, డీసీవో సంజీవరెడ్డి, డీఆర్డీవో కిషన్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, ఆర్టీవో సంతోష్ కుమార్, డీఏవో కల్పన తదితరులు పాల్గొన్నారు.