- రెవెన్యూ, ఇరిగేషన్జాయింట్సర్వేతో కబ్జాదారుల్లో గుబులు
- కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
- ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ హద్దులు ఏర్పాటు చేయనున్న అధికారులు
చెన్నూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో చెరువుల కబ్జా కారణంగా చుట్టుపక్కల కాలనీలు ముంపునకు గురవుతున్నాయని ఫిర్యాదులు రావడంతో కలెక్టర్‌కుమార్ దీపక్ చెరువుల సర్వేకు ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సోమవారం నుంచి జాయింట్ సర్వే ప్రారంభించారు. ముందుగా చెన్నూర్ టౌన్‌లోని కుమ్మరికుంట చెరువును సర్వే చేస్తున్నారు. కుమ్మరికుంట విస్తీర్ణం 16.24 ఎకరాలు కాగా, సుమారు 8 ఎకరాలు కబ్జా అయినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుంచి అస్నాద్ఎక్స్ రోడ్డు వరకు చెరువు ఎఫ్టీఎల్నుంచే రోడ్డు నిర్మించారు. ఇదే అదునుగా రోడ్డు వైపు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో బిల్డింగులు వెలిశాయి. దీంతో అధికారులు 17 మందికి నోటీసులు జారీ చేసి చెరువును సర్వే చేస్తున్నారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ హద్దులు నిర్ణయించి ఆక్రమణలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
సంచలనంగా మారిన శనిగకుంట పేల్చివేత
చెన్నూర్ శివారులోని శనగకుంట చెరువు 33.22 ఎకరాల్లో విస్తరించి ఉండగా, దీనికింద సుమారు 70 ఎకరాల ఆయకట్టు సాగువుతోంది. వర్షాకాలంలో చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు ముంపునకు గురవుతోందని ఇటీవల చెరువు మత్తడిని కొంతమంది జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చేశారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనలో వార్డు కౌన్సిలర్ భర్త, బీఆర్ఎస్ లీడర్ పెండ్యాల లక్ష్మీనారాయణతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ నేపథ్యంలో శనగకుంట చెరువును సర్వే చేసి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
దీంతో త్వరలోనే శనగకుంట చెరువును సైతం సర్వే చేయనున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే చెన్నూర్ పెద్ద చెరువు 25 ఎకరాలకు పైగా ఉండగా, ఇందులోనూ కొంత భూమి గతంలోనే కబ్జా అయినట్టు అనుమానిస్తున్నారు. చెరువుల కబ్జాపై గవర్నమెంట్ సీరియస్‌గా ఉండడం, కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు జాయింట్ సర్వే స్టార్ట్ చేయడంతో కబ్జాదారుల్లో గుబులు మొదలైంది.