భూసేకరణ సర్వే స్పీడప్ చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

భూసేకరణ సర్వే స్పీడప్ చేయాలి :  కలెక్టర్ కుమార్ దీపక్
  • కలెక్టర్ కుమార్ దీపక్ 

జైపూర్, వెలుగు: మంచిర్యాల–వరంగల్–ఖమ్మం–విజయవాడ జాతీయ రహదారి 163జీ నిర్మాణానికి జిల్లాలో భూసేకరణ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం ఆర్డీవో రాములు, జైపూర్ తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి మండలంలోని టేకుమట్ల, ఎల్కంటి, షెట్​పల్లి, నర్సింగాపూర్, బెజ్జాల, కుందారం, రొమ్మిపూర్, కిష్టాపూర్, వేలాల గ్రామాల్లో పర్యటించి సర్వేను పరిశీలించారు. 

రహదారి 163జీ 334 కిలోమీటర్ల మేర ఉంటుందని, జిల్లా పరిధిలో 110 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉండగా ఇప్పటికే 83 హెక్టార్ల భూమి అప్పగించారని తెలిపారు. రహదారుల నిర్మాణంలో కోల్పోతున్న అటవీ శాఖ భూములకు ప్రత్యామ్నాయ భూములను గుర్తించాలని, అటవీ శాఖ ద్వారా అవసరమైన అనుమతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు, భూ యజమానులు, రైతుల సమన్వయంతో ప్రక్రియ త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి 

లక్సెట్టిపేట, వెలుగు: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటాలని కలెక్టర్ అన్నారు. లక్సెట్టిపేటలోని మహాత్మ జ్యోతిబాపూలే కాలేజీ ఆవరణలో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్​ను ఆయన ప్రారంభించారు. ఆటల్లో జయాపజయాలు సహజమని క్రీడలను స్నేహపూర్వక వాతావరణం లో నిర్వహించుకోవాలని సూచించారు. అధికారులు వినోద్ కుమార్, శ్రీధర్, కాలేజీ ప్రిన్సిపాల్ రొనాల్డ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 

రిజిస్టర్లలో నమోదు చేయాలి

నస్పూర్, వెలుగు: ఆశా కార్యకర్తలు అందిస్తున్న ఆరోగ్య కార్యక్రమాల వివరాలను రిజిస్టర్లలో ఖచ్చితంగా నమోదు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ భవన సముదాయంలో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీశ్ రాజ్, వైద్యాధికారి డాక్టర్ కృపాబాయి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఫయాజ్​తో కలిసి ఆశా కార్యకర్తలకు రిజిస్టర్లు అందించారు. ఆశా కార్యకర్తలు తాము అందిస్తున్న ఆరోగ్య కార్యక్రమాలు, సేవల వివరాలను రిజిస్టర్లలో ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. వైద్యాధికారి డాక్టర్ అనిల్, మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.