లాభాపేక్ష లేకుండా ఇండియన్ రెడ్​క్రాస్  సొసైటీ సేవలు : కుమార్ దీపక్

లాభాపేక్ష లేకుండా ఇండియన్ రెడ్​క్రాస్  సొసైటీ సేవలు : కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవ చేస్తున్నారని మంచిర్యాల కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం మంచిర్యాల పట్టణం చున్నంబట్టివాడలోని ఆనంద నిలయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జిల్లాలోని రెడ్ క్రాస్ సొసైటీకి అందించిన బ్లడ్ డొనేషన్ క్యాంపర్ వాహానాన్ని ఐఓసీఎల్ డీజీఎం కైలాశ్ కాంత్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్​ రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

కలెక్టర్ మాట్లాడుతూ.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 15 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారని.. జిల్లాలోని డయాలసిస్, సికిల్సెల్, తలసేమియా వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర సమయాలలో రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరం నుంచి రక్తం అందిస్తున్నట్లు చెప్పారు. సొసైటీ ఆధ్వర్యంలో 3 నెలలకు ఒకసారి రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు.

అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఐఓసీఎల్ రామగుండం ఇన్​చార్జ్ ఆసిఫ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రధాన కార్యదర్శి చందూరి మహేందర్, రాష్ట్ర కమిటీ సభ్యులు మధుసూదన్ రెడ్డి, కోశాధికారి సత్యపాల్ రెడ్డి, కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.