చెన్నూర్​ దసలి పట్టు దేశంలోనే నంబర్  వన్ : కలెక్టర్  కుమార్  దీపక్

చెన్నూర్​ దసలి పట్టు దేశంలోనే నంబర్  వన్ : కలెక్టర్  కుమార్  దీపక్
  • పట్టు వస్త్రాలు ఇక్కడే తయారుచేసేలా చర్యలు
  • దసలి పట్టు కృషి కిసాన్​ మేళాలో కలెక్టర్  కుమార్  దీపక్

చెన్నూర్, వెలుగు: చెన్నూర్​ దసలి పట్టు క్వాలిటీలో దేశంలోనే నంబర్​ వన్​గా నిలువడం గర్వకారణమని మంచిర్యాల కలెక్టర్​ కుమార్​ దీపక్​ పేర్కొన్నారు. మంగళవారం చెన్నూర్​లోని సెరీకల్చర్​ గోదాముల ఆవరణలో దసలి పట్టు కిసాన్  కృషి మేళాను ఆయన ప్రారంభించారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన పట్టు గూళ్లు ఉత్పత్తి చేసే రైతులు పాల్గొన్నారు. దసలి పట్టు ఉత్పత్తిలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లారు.

వారు ఉత్పత్తి చేస్తున్న నాణ్యమైన పట్టుకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. దసలి పట్టు రైతులకు సెరికల్చర్  డిపార్ట్​మెంట్  నుంచి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఫారెస్ట్  అధికారులతో ఇబ్బంది కలగకుండా చూస్తామన్నారు.

పట్టు వస్త్రాలను ఇక్కడే తయారు చేసేందుకు అవసరమైన మెషీన్లు​కొనుగోలు చేసి రైతులకు ట్రైనింగ్  ఇప్పిస్తామన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పట్టు రైతులు పట్టు వస్ర్తాలను స్టాల్స్​లో ప్రదర్శించారు. సెరీకల్చర్, హార్టికల్చర్​ స్టేట్​ జాయింట్  డైరెక్టర్  ఎం.లత, జిల్లా అధికారి అనిత, చెన్నూర్​ ఏడీ రాథోడ్  పార్వతి, సైంటిస్ట్  డాక్టర్  భగవాన్​దాస్​ పాల్గొన్నారు.