మంచిర్యాల  జిల్లాలో వడ్ల కొనుగోళ్లకు పక్కాగా ఏర్పాట్లు :  కలెక్టర్ కుమార్ దీపక్ 

మంచిర్యాల  జిల్లాలో వడ్ల కొనుగోళ్లకు పక్కాగా ఏర్పాట్లు :  కలెక్టర్ కుమార్ దీపక్ 
  • జిల్లాలో 321 సెంటర్ల ద్వారా సేకరణ
  • 48 గంటల్లో రైతులకు అకౌంట్లలో డబ్బులు జమ 
  • సన్నబియ్యం అమ్ముకుంటే రేషన్​ కార్డులు రద్దు
  • మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ 

మంచిర్యాల, వెలుగు: జిల్లాలో వడ్ల కొనుగోలుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, డీసీఎస్వో బ్రహ్మారావు, డీఎం శ్రీకళతో కలిసి కలెక్టరేట్​లో మీడియాతో మాట్లా డారు. జిల్లాలో 321 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్రేడ్ ఏ రూ.2,320, గ్రేడ్ బీ రూ.2,300 మద్దతు ధర, సన్నాలకు రూ.500 బోనస్ చెల్లిస్తామన్నారు. జిల్లాలో 3.41 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

స్థానిక అవస రాలు, విత్తనాలు, రైస్ మిల్లర్ల కొనుగోలు పోను 3.31 లక్షల టన్నుల ధాన్యం సెంటర్లకు వచ్చే ఛాన్స్ ఉందన్నారు. సెంటర్లలో మహిళా సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చి ఐకేపీకి 194, మెప్మాకు 6 కేటాయించామని తెలిపారు. 82.98 లక్షల గోనె సంచులు అవసరం కాగా, ప్రస్తుతం అవసరం మేరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతుల వివరాలు ట్యాబ్లలో నమోదు చేసి 48 గంటల్లోగా అకౌంట్లలో నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

డీలర్లు అక్రమాలకు పాల్పడితే లైసెన్స్ రద్దు చేస్తాం

జిల్లాలో ఇప్పటివరకు 3,400 మెట్రిక్ టన్నుల (82.05 శాతం) సన్నబియ్యం రేషన్ కార్డుదారులకు పంపిణీ చేశామని కలెక్టర్ తెలిపారు. సన్నబియ్యాన్ని అమ్ముకుంటే కార్డు రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే వారి లైసెన్స్ రద్దు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు అమ్మినా, సాగు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు రాకుండా బోర్డర్ లో చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు.