నస్పూర్, వెలుగు: అత్యవసర వైద్య సేవలు, సికిల్ సెల్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తనిధి కేంద్రం ద్వారా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లాలో అందిస్తున్న సేవలు అభినందనీయమని కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీ నగర్ లో ఉన్న రెడ్ క్రాస్ సొసైటీ ఆనంద నిలయంలో తలసేమియా–సికిల్ సెల్ వార్డు భవన నిర్మాణానికి రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ బొప్పు సతీశ్‌తో కలిసి భూమి పూజ చేశారు. నిర్మాణ పనులను స్పీడప్ చేసి త్వరగా పూర్తి చేసి వ్యాధిగ్రస్తులకు సేవలు అందించేందుకు సిద్ధం చేయాలన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి చందూరి మహేందర్, ఎంసీ సభ్యులు మధుసూదన్ రెడ్డి, సత్యపాల్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్, ఉదారి చంద్రమోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సమర్థంగా చేపట్టాలి
జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతిలాల్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి హరీశ్ రాజ్‌తో కలిసి జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఒకటి నుంచి19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఆల్బెండాజోల్ మాత్రలు ఇవ్వాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, జూనియర్ కాలేజీల పిల్లలకు మాత్రలు వేయాలని సూచించారు. వైద్యాధికారులు డా.అనిత, ప్రసాద్, సుధాకర్ నాయక్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.