మంచిర్యాల/బెల్లంపల్లి/నస్పూర్, వెలుగు: జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా మంచిర్యాల–వరంగల్–ఖమ్మం–విజయవాడ జాతీయ రహదారి 163జి నిర్మాణంలో భూములు కోల్పోయిన అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన వారి వివరాలను బుధవారం జిల్లా కేంద్రంలోని అర్డీవో ఆఫీసులో అర్డీవో శ్రీనివాస్ రావుతో కలిసి పరిశీలించారు. బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఆర్బిట్రేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సంక్షేమ కార్యక్రమాలపై విచారణ జరపాలి
రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇతర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరపాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. బుధవారం బెల్లంపల్లి పట్టణంలో పర్యటించిన కలెక్టర్ మండలంలో పలు ప్రభుత్వ ఆఫీసులను పరిశీలించారు. ఆ తర్వాత తహసీల్దార్ ఆఫీస్లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల్లో అర్హులైనవారి జాబితాను జనవరి 26 నాటికి సిద్ధం చేయాలన్నారు. బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, తహసీల్దార్ జ్యోత్స్న, తాండూర్ ఎంపీడీఓ శ్రీనివాస్, డిప్యూటీ తహసిల్దార్ ప్రసాద్, బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత తదితరులు పాల్గొన్నారు.
జంగల్ సఫారీ ప్రారంభం
పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కల్పించేందుకు జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో జంగల్ సఫారీ ఏర్పాటు చేసినట్లు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం జిల్లాలోని లక్షెట్టిపేట రేంజ్-కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని హాజీపూర్ మండలం ర్యాలీ గడ్ పూర్ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన జంగల్ సఫారీని జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో కలిసి ప్రారంభించారు. జిల్లాలో పర్యాటకరంగ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల సౌకర్యం కొరకు జంగల్ సఫారీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.