కలెక్టర్ ​ఆకస్మిక తనిఖీ..పల్లె దవాఖానకు తాళం

తుంగతుర్తి , వెలుగు : సూర్యాపేట జిల్లా కాసర్ల పహాడ్ గ్రామంలోని పల్లె దవాఖానను శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ఎస్. వెంకట్రావు తాళం వేసి ఉండడంతో అవాక్కయ్యారు. డీఎంహెచ్ వో కోటా చలంకు ఫోన్​చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని కాసర్లపహాడ్ గ్రామంలోని పల్లె దవాఖాను మధ్యాహ్నం ఒకటిన్నరకు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే, దవాఖానకు తాళం వేసి ఉండడంతో ఎక్కడున్నారని ఆరా తీశారు. 

ఎవరూ కనిపించకపోవడంతో కొమ్మాల గ్రామానికి వెళ్లిపోయారు. మధ్యాహ్నం రెండున్నరకు మళ్లీ తిరిగి రాగా దవాఖాన ఓపెన్​ చేసి ఉంది. చూడగా ఆశ వర్కర్​ కనిపించింది. ఇంతకుముందు తాళం ఎందుకు వేశావని ప్రశ్నించగా డాక్టర్​ బ్యాంకు పనిపై వెళ్లడంతో తాళం వేశానని, కాసేపట్లో వస్తాడని చెప్పింది. వెంటనే డీఎంహెచ్​వో కు ఫోన్​చేసిన కలెక్టర్​ విధుల్లో లేని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దవాఖానలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వెంట ఎంపీడీవో సందీప్ కుమార్, గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ ఉన్నారు.