ఆయిల్ పామ్ సాగులో అగ్రస్థానంలో నిలపాలి : కలెక్టర్ మనుచౌదరి

ఆయిల్ పామ్ సాగులో అగ్రస్థానంలో నిలపాలి : కలెక్టర్ మనుచౌదరి
  • కలెక్టర్ మనుచౌదరి

సిద్దిపేట, వెలుగు: ఆయిల్ పామ్ సాగులో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని కలెక్టర్ మను చౌదరి పిలుపునిచ్చారు. శనివారం నంగునూరు మండలం నర్మెటలో ఉద్యానవన శాఖ,  వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో  నిర్వహించిన ఆయిల్ పామ్ రైతుల అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. నర్మెటలో రూ.300 కోట్లతో ఆయిల్ పామ్ కర్మాగారం పనులు జరుగుతున్నాయన్నారు. 

ఈ కర్మాగారానికి రంగనాయక సాగర్ నుంచి నీటిని నిల్వ చేసుకోవడానికి ఒక పాండ్ ను నిర్మించామన్నారు. అనంతరం ఈజీఎస్ మెయింటెనెన్స్, సబ్సిడీ అమౌంట్లు సకాలంలో అందడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాధిక, శాస్త్రవేత్తలు, వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు ఆయిల్ ఫామ్ సాగు రైతులు పాల్గొన్నారు.

నర్మెటలో స్వల్ప ఉద్రిక్తత

అవగాహన సదస్సు సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. ప్రొటోకాల్ ప్రకారం జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, ఇన్​చార్జి మంత్రి కొండ సురేఖకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని నంగునూరు మండలం కాంగ్రెస్ నాయకులు  నర్మెట గ్రామానికి చేరుకుని "హరీశ్ రావు గో బ్యాక్ " అంటూ నినాదాలు చేశారు. వీరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేక నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.