ప్రతి రైతుకు న్యాయం చేస్తాం : కలెక్టర్ మనుచౌదరి

ప్రతి రైతుకు న్యాయం చేస్తాం : కలెక్టర్ మనుచౌదరి

సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్​ఆర్) కోసం భూములు కోల్పోతున్న ప్రతి రైతుకు న్యాయం చేస్తామని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్ లో భూమి కోల్పోతున్న ఆయా గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..వ్యవసాయమే బతుకుదెరువుగా జీవనం సాగిస్తున్నామని అలాంటి భూమిని ట్రిపుల్​ఆర్​కు తీసుకోవడం బాధాకరమైనప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపారు.

పరిహారం విషయంలో ప్రత్యేక చొరవ చూపించి బహిరంగ మార్కెట్ లో ఉన్న ధరను చెల్లించాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం గుండా ట్రిపుల్​ఆర్​వెళ్తున్నందున ఈ ప్రాంత అభివృద్ధి కోసం భూమిని ఇవ్వడానికి ఒప్పుకోవడం శుభపరిణామం అన్నారు. ఆయా గ్రామాల్లో భూమి వ్యాల్యూ ను రైతులు తెలిపిన వాటిని పూర్తిగా నోట్ చేసుకుని రాష్ట్ర స్థాయి అధికారులకు పంపించి అందరికి న్యాయం చేయడానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ల్యాండ్ పూలింగ్ గురించి కూడా అధికారులతో చర్చిస్తానని తెలిపారు.