
సిద్దిపేట టౌన్, వెలుగు : ప్రజావాణికి వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టర్ఆఫీసులో అడిషనల్కలెక్టర్గరిమా అగర్వాల్‌తో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చిన సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలని అధికారులకు సూచించారు.
మొత్తం 42 ఫిర్యాదులు అందాయని ఇందులో భూ సమస్యలు, డబుల్బెడ్రూం, దళిత బంధు, ఆసరా పింఛన్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. నారాయణపేట మండల కేంద్రంలో జ్యోతిబాఫూలే బీసీ బాలుర హాస్టల్ ఏర్పాటు చేయాలని గౌటి బాబేశ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో డీఆర్‌వో నాగరాజమ్మ, డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్యా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలో..
మెదక్ టౌన్ : ప్రజావాణికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు, డీఆర్‌వో పద్మశ్రీ అధికారులకు సూచించారు. సోమవారం మెదక్కలెక్టర్ఆఫీసులో ప్రజల నుంచి అర్జీలు, అప్లికేషన్లు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొత్తం 134 అర్జీలు రాగా వాటిని అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు అందజేసి పరిష్కరించాల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో నవీన్ మల్కాజి, ఇందిర, బ్రహ్మాజీ, కరుణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి టౌన్ : పీఎం మోదీ బహిరంగ సమావేశం సందర్భంగా సోమవారం జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయి ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజా విజ్ఞప్తులను డీఆర్‌వో పద్మజారాణి, కలెక్టరేట్ ఏవో పరమేశ్వర్ స్వీకరించారు. ప్రభుత్వం ఈనెల 9 వరకు ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో జనం తాకిడి తక్కువగా ఉంది.
మొత్తం 38 అప్లికేషన్లు వచ్చాయి. సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామానికి చెందిన జంగం సాయి తన మూడెకరాల భూమిని గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించారని వారి నుంచి ఇప్పించాల్సిందిగా కోరారు. సదాశివపేటకు చెందిన సాయి వరుణ్, సాయి చరణ్ తమ అమ్మానాన్నలు చిన్నతనంలోనే మృతి చెందడంతో అమ్మమ్మ వద్ద జీవిస్తున్నానని చదువుకోవడానికి ఆర్థిక సాయం, ఉండడానికి ఇల్లు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.