
సిద్దిపేట, వెలుగు: అకాల వర్షాలతో రైతులు ఎలాంటి అందోళన చెందవద్దని పండిన- ప్రతి గింజను కొనుగోలు చేస్తామని కలెక్టర్ మను చౌదరి అన్నారు. ఆదివారం యాసంగి పంట కొనుగోళ్ల పై అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. జిల్లాలో 418 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇప్పటివరకు 2,365 మంది రైతుల నుంచి 11,305 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. అకాల వర్షాల దృష్ట్యా ఇంకా అవసరమైన చోట్ల టార్ఫాలిన్ కవర్లు సమకూర్చాలని మార్కెటింగ్ శాఖను ఆదేశించారు.
కొనుగోళ్లలో ఎటువంటి జాప్యం లేకుండా చూసి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు వెంటనే తరలించాలని వంద ట్యాబు ఎంట్రీ పూర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని పౌరసరఫరాల శాఖా అధికారులకు సూచించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో డీఎం సివిల్ సప్లై హరీశ్, డీసీఎస్వో తనూజ, డీఆర్డీవో జయదేవ్, పీడీ హనుమంత రెడ్డి పాల్గొన్నారు.