- చిన్న రైతుల వద్దకు పెద్ద కంపెనీలను రప్పిద్దాం
హుస్నాబాద్, వెలుగు: ఫార్మర్ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల(ఎఫ్‌పీవో)తో జిల్లాలో అగ్రిబిజినెస్ను డెవలప్చేద్దామని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. చిన్నరైతులతో వినూత్నమైన, మార్కెట్‌కు అవసరమైన పంటలను పండిస్తూ, పెద్ద కంపెనీలే వచ్చి కొనుగోలుచేసేలా ప్రణాళికలు వేద్దామన్నారు. ఇందుకు పైలట్ ప్రాజెక్టుగా అక్కన్నపేట మండలాన్ని ఎంపికచేసినట్టు చెప్పారు. గురువారం ఆయన అక్కన్నపేట మండలకేంద్రంలో ప్రహర్ష ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల చైర్మన్, సీఈవో, బోర్డు ఆఫ్ డైరక్టర్లను రైతులకు పరిచయం చేశారు. కృషి కల్ప ఫౌండేషన్ సీఈవో పాటిల్ బృందం ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లతో కలిసి పనిచేస్తుందని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయంలో సాంకేతిక సేవలు, ప్రాజెసింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి, సన్న, చిన్నకారు రైతులను ఈ ఎఫ్‌పీవోలు ఆర్థికంగా బలోపేతం చేస్తాయన్నారు.
వ్యవసాయ మార్కెటింగ్‌లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్టుగా కంపెనీలకే పంట ఉత్పత్తులను అమ్ముకోవచ్చన్నారు. బేరసారాల్లో పెద్ద కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేందుకు ఎఫ్‌పీవోలు రైతులకు ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా రన్ అవుతున్న ఈ ఎఫ్‌పీవోలను జిల్లాలో ఏర్పాటుచేసి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేద్దామన్నారు. ప్రసిద్ధ, ప్రహర్ష రైతు ఉత్పత్తిదారు సంఘాల ఆధ్వర్యంలో కృషి కల్ప సంస్థ సహకారంతో రైతుల ద్వారా పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి అధిక లాభాలు పొందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల జిల్లా అధికారులు రాధిక, సువర్ణ, నాబార్డు డీడీఎం నిఖిల్, ఆర్డీవో రామ్మూర్తి పాల్గొన్నారు.