ఆలోచనలతోనే ఆవిష్కరణలు .. ఎస్​బీఐటీలోని జిల్లా స్థాయి ఐడియాథాన్ లో కలెక్టర్ ముజామ్మిల్​ ఖాన్​

ఆలోచనలతోనే ఆవిష్కరణలు .. ఎస్​బీఐటీలోని జిల్లా స్థాయి ఐడియాథాన్ లో కలెక్టర్ ముజామ్మిల్​ ఖాన్​

ఖమ్మం టౌన్, వెలుగు : ఇప్పుడు ఉపయోగంలో ఉన్న ఆవిష్కరణలన్నీ గతంలో ఆలోచనలేనని  ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం ఖమ్మం సిటీలోని ఎస్​బీఐటీ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి ఐడియాథాన్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో వనరుల కొరత వల్ల ఆలోచనలు అమలుకు నోచుకోలేకపోయాయని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని, వచ్చిన ఆలోచన పై పట్టుదలతో అడుగులు వేస్తే విజయం ఖాయమని తెలిపారు. కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ ఓ అద్భుతమైన ఆలోచన ప్రపంచ గతినే మారుస్తుందని, ఇంటర్నెట్ అందుకు సాక్ష్యమని గుర్తుచేశారు. 

టాస్క్ రిలేషన్ షిప్ మేనేజర్ పి. దినేశ్​ మాట్లాడుతూ తెలంగాణా అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (టాస్క్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఐడియాథాన్ స్పందనతో సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే ఎన్నో ఆలోచనలు పుట్టుకొచ్చాయని తెలిపారు. పాజెక్ట్ మేనేజర్ బి. బాలు ప్రవరాఖ్య మాట్లాడుతూ జిల్లాస్థాయిలో 10 కళాశాలలు పాల్గొనగా, 313 ఆలోచనలను పంపారని, అందులో 56 ఎంపిక చేయగా 186 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు వివరించారు. జిల్లాస్థాయిలో విజయం సాధించిన టీమ్ ను రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతారని తెలిపారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ జి. ధాత్రి, ప్రిన్సిపాల్ డాక్టర్. జి. రాజ్ కుమార్ విద్యార్థులకు సర్టిఫికెట్స్, బహుమతులు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో హెడొల్ద్ హై ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ ఎన్. అర్జున్, గేమిఫైంగ్ ఎడ్యుకేషన్ ఫౌండర్ శ్రీరామ్ సంకీర్త్, కళాశాల అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డాక్టర్​ఏవీవీ శివ ప్రసాద్, డాక్టర్​ జె. రవీంద్రబాబు, డాక్టర్​ఎస్. శ్రీనివాసరావు, హెచ్​వోడీలు, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెల్ ఇన్​చార్జి డాక్టర్​స్ఫూర్తి, అశ్విని, హరిణి, టీపీవో ఎన్. సవిత, కోఆర్డినేటర్ జి. ప్రభాకర్ పాల్గొన్నారు.