ఖమ్మం టౌన్, వెలుగు : రెవెన్యూకు సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో రెవెన్యూ అధికారులతో ధరణి, ప్రజావాణి, ప్రభుత్వ భూముల పరిరక్షణ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. మండల స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నారు.
డీటీ, ఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ అందిరకీ చట్టాలపై అవగాహన ఉండేలా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతి తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో ధరణి సహాయక కేంద్రాన్ని ఏర్పాటుచేయాలన్నారు. ప్రతి సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు.
ఎస్టీ, ఎస్సీ, మానవ హక్కుల, గ్రీన్ ట్రిబ్యునల్ తదితర కమిషన్లకు నివేదికలు సమయంలోపు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తుల పరిశీలన పెండింగ్‌లు లేకుండా వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్, ట్రైనీ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, ఆర్డీవోలు జి. గణేశ్, ఎల్. రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
స్కూల్ తనిఖీ
ఖమ్మం నగరంలోని రోటరీ నగర్ జడ్పీహెచ్ఎస్ను కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టూడెంట్స్ తో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతోందని తెలిపారు. విద్యార్థుల కనీస విద్యా ప్రమాణాలపై టీచర్లు శ్రద్ధ వహించాలని సూచించారు. స్కూల్పక్కనే వీధి వ్యాపారుల ప్రాంగణం ఖాళీగా ఉన్నందున అక్కడ స్టూడెంట్స్ కు క్రీడల కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు.