
- సేంద్రియ సాగపై సలహాలు, సూచనలు అందించాలి
- కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
తల్లాడ, వెలుగు: అగ్రికల్చర్కోర్సులు చేస్తున్న స్టూడెంట్స్రైతులు లాభాలు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని, సేంద్రియ సాగుపై సలహాలు, సూచనలు అందించాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. గురువారం ఆయన కుర్నవల్లి రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ, వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అశ్వరావుపేట అగ్రికల్చర్కాలేజీ స్టూడెంట్స్ తో ఏర్పాటుచేసిన గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని మరిచిపోతే అస్తిత్వం కోల్పోతామమన్నారు. 50 ఏళ్ల కింద దేశంలో వచ్చిన ఆహార సంక్షోభం గురించి వివరించారు. వ్యవసాయ విప్లవం తర్వాతే దేశం ఆహార స్వావలంబన సాధించిందని గుర్తుచేశారు. స్టూడెంట్స్ రాబోయే రోజుల్లో రైతులకు మరిన్ని సేవలు అందించాలని, కొత్త సాగు పద్ధతులు నేర్పించాలని, అధిక దిగుబడి, ఆదాయం వచ్చే విధంగా సలహాలు సూచనలు అందించాలని సూచించారు. స్టూడెంట్స్ ఏర్పాటు చేసిన ఆహార నిల్వల స్టాల్స్ ను పరిశీలించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
కుర్నవల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం బైక్ పై ప్రయాణించి ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్ర వద్దకు వెళ్లి రిజిస్టర్లు, ధాన్యంలో తేమశాతం, గన్ని బ్యాగుల లెక్కలను పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఉంటే తనకు సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు. ఇటీవల ఈదురుగాలులకు కూలిపోయిన రైస్ మిల్లును పరిశీలించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నాణ్యత పాటించకుండా నిర్మించడం వల్లే కూలిపోయిందని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఏవో పుల్లయ్య, ఏడీఏ శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్హేమంత్ కుమార్, వైరా కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రవికుమార్, ఏవో తాజుద్దీన్, శాస్త్రవేత్తలు, బోధన సిబ్బంది పాల్గొన్నారు.