మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి : ముజామ్మిల్​ ఖాన్​

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి : ముజామ్మిల్​ ఖాన్​
  • కలెక్టర్​ ముజామ్మిల్​ ఖాన్​

ఖమ్మం టౌన్, వెలుగు :  మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని, అప్పుడే వారి కటుంబాలు బాగుపడతాయని, పిల్లలకు మంచి భవిష్యత్ ​ఉంటుందని ఖమ్మం కలెక్టర్​ ముజామ్మిల్​ ఖాన్​ తెలిపారు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా ఎదిగేందుకు నమ్మకం ముందు తరాలకు వస్తుందన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా రెండు రోజుల పాటు జిల్లాలోని 5 నియోజకవర్గాల గ్రామీణ మహిళా వ్యాపార వేత్తలు, సెర్ఫ్ సిబ్బందికి చిన్న తరహా వ్యాపారాల నైపుణ్యాభివృద్ధిపై స్థానిక శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మొదటి రోజు మధిర, సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించినవారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలకు ఆర్థిక బలం, ఆర్థిక స్వతంత్రత ఉంటేనే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుందని తెలిపారు. వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు మహిళలకు ధైర్యం ఉండాలని, ప్రారంభంలో మనకు వంద రకాల సందేహాలు, భయాలు ఉంటాయని వీటిని అధిగమిస్తూ కొత్త విషయాలను నేర్చుకుంటూ వ్యాపారాలను చేయాలన్నారు. 

అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్​ ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా(ఏఎల్ఈఏపీ) స్కిల్ డెవలప్​మెంట్ చైర్ పర్సన్ అన్నపూర్ణ మాట్లాడుతూ మహిళలకు ఉన్న అవకాశాల గురించి తెలుసుకొని ఉన్నతస్థాయి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో సన్యాసయ్య, అడిషనల్ డీఆర్డీవో నూరొద్దీన్, ఏఎల్ఈఏపీ విజయవాడ రీజినల్ మేనేజర్ సునీత, ఐవోఎల్​ ట్రైనర్ శివ నారాయణ, సీహెచ్ రవీందర్, హైదరాబాద్ సేర్ప్ ప్రాజెక్టు మేనేజర్  శ్రావణ్ పాల్గొన్నారు.

విధులు సమర్థవంతంగా చేపట్టాలి

సమర్థవంతంగా విధుల నిర్వహిస్తూ, నిర్ధిష్టమైన సేవలను ప్రజలకు సకాలంలో అందించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్ లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఆరు రెవెన్యూ విభాగ పర్యవేక్షకుల కోసం ఏర్పాటు చేసిన నూతన ఛాంబర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో కలెక్టరేట్ కు వస్తారని, వారి పట్ల చిత్తశుద్ధితో పని చేస్తూ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ.పద్మశ్రీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. రాజేశ్వరి, కలెక్టరేట్ ఏవో ఎన్.అరుణ, వివిధ సెక్షన్ల పర్యవేక్షకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 

సర్దార్ పటేల్ స్టేడియం సందర్శన 

అడిషనల్​ కలెక్టర్ శ్రీజతో కలిసి నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియాన్ని కలెక్టర్​ సందర్శించారు. అనంతరం పోటీ క్రీడలకు శిక్షణ పొందుతున్న క్రీడాకారులతో కలెక్టర్ ముచ్చటించారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి భవిష్యత్​ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సర్దార్ పటేల్ స్టేడియంలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్రీడాకారులకు పౌష్టికాహారం, పండ్లు ఇవ్వాలని సూచించారు. జిల్లా క్రీడల అభివృద్ధి, యువజన సంక్షేమ అధికారి సునీల్ రెడ్డి, కోచ్ మతీన్, మున్సిపల్ అధికారులు ఉన్నారు.