- దరఖాస్తు సమయంలో పొరపాట్లు జరగకుండా చర్యలు
- రెండు వారాల్లోగా ఆర్డీవో ఆఫీసుల్లో ఏర్పాటుకు సన్నాహాలు
ఖమ్మం, వెలుగు: రైతులకు ఇబ్బందికరంగా మారుతున్న ధరణి సంబంధిత సమస్యలపై ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ప్రత్యేక దృష్టిపెట్టారు. ప్రతి వారం గ్రీవెన్స్‌లో భూ వివాదాలకు సంబంధించి, ధరణి రిలేటెడ్ ఇష్యూస్పైనే ఎక్కువ మంది బాధితులు వస్తుండడంతో వాటి పరిష్కారంపై ఫోకస్ చేశారు. ఖమ్మం కలెక్టరేట్ లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేశారు.
ధరణిలో తమ సమస్యలకు సంబంధించి రైతులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా హెల్ప్ డెస్క్‌లో సమాచారం అందిస్తారు. రైతు సమస్యను తెలుసుకొని, దానికి ఏ మాడ్యూల్లో అప్లై చేయాలి, ఏయే ఆధారాలను అందించాలనే విషయాన్ని వివరిస్తారు. దీంతో అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఉంటుందని, రైతులు కూడా పదే పదే అధికారుల చుట్టూ తిరగకుండా ఈ విధానాన్ని అమలుచేయాలని కలెక్టర్ నిర్ణయించారు. రెండు వారాల్లోగా ఆర్డీవో కార్యాలయాల్లో, ఆ తర్వాత అన్ని తహసీల్దార్ ఆఫీసుల్లోనూ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటుచేయనున్నారు.
దరఖాస్తుల్లో తప్పులతో తిప్పలు..
ధరణి పోర్టల్ లో వ్యవసాయ భూముల నమోదు తర్వాత రైతులు చాలా మంది వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. భూమి విస్తీర్ణం తక్కువగా నమోదు కావడం, ఇతరుల పేరుతో భూమి నమోదు కావడం, నిషేధిత భూముల జాబితాలో ఉండడం.. ఇలాంటి సమస్యల పరిష్కారానికి మీ సేవా కేంద్రాల ద్వారా రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. సరైన ఫార్మాట్లో దరఖాస్తు చేసుకోకపోవడం, దరఖాస్తుకు సంబంధించి సరైన ఆధారాలను చూపించకపోవడం వలన అధికారులు పరిశీలన సమయంలో వాటిని రిజెక్ట్ చేస్తున్నారు.
దీంతో రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. అందుకోసం దరఖాస్తు చేసే సమయంలోనే రైతులను గైడ్ చేసేందుకు హెల్ప్ డెస్క్ లు ఉపయోగపడనున్నాయి. వాటిలో రైతులకు అందుబాటులో ఉండేలా ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించారు. అప్లై చేసుకునే ప్రాసెస్‌తో పాటు, దరఖాస్తు చేసుకున్న తర్వాత అప్లికేషన్ల స్టేటస్‌ను కూడా హెల్ప్‌డెస్క్‌లో తెలుసుకోవచ్చు. ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ అయితే, ఎందుకు రిజెక్ట్ అయిందనే రీజన్ కూడా చెబుతారు. తహసీల్దార్, ఆర్డీవో వంటి ఆఫీసర్ల చుట్టూ తిరగకుండా దీన్ని ప్లాన్ చేశారు.
ఖమ్మం జిల్లాలో 15 వేల అప్లికేషన్లు రిజెక్ట్..
ధరణికి సంబంధించిన సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల ప్రభుత్వం సూచించిన సమయంలో ఖమ్మం జిల్లాలో 78,710 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా పట్టాదారు పాస్ బుక్‌లో డేటా కరెక్షన్, నిషేధిత భూముల జాబితా నుంచి తొలగింపు, మ్యుటేషన్, వారసత్వ భూములకు సంబంధించిన సమస్యలే ఉన్నాయి. వీటిలో వివిధ కారణాల వల్ల దాదాపు 15 వేల దరఖాస్తులను ఆఫీసర్లు రిజెక్ట్ చేశారు. దీంతో బాధిత రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్‌గా పని చేసిన ముజామ్మిల్ ఖాన్, అక్కడ ప్రయోగాత్మకంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఖమ్మంలోనూ అమలు చేయాలని నిర్ణయించారు.
రెండేళ్లయినా పరిష్కారం కాలే..
సింగరేణి, రెవెన్యూ పరిధిలో 52 సర్వే నంబర్ లో మూడెకరాల పట్టా భూమి ఉంది. ధరణి పాస్ బుక్ కూడా ఉంది. పట్టా భూమి ధరణిలో పీవోబీ(ప్రొహిబిటెడ్ ఆర్డర్ బుక్)గా నమోదైంది. సరి చేయాలని మీ సేవా ద్వారా రెండు సార్లు ధరఖాస్తు చేశాను. రెండేండ్లైనా పరిష్కారం కాలేదు.
ఎం. ఏకాంబరం, రైతు, కారేపల్లి
రైతుల ఇబ్బందులు తప్పించేందుకే..
సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటేనే రైతులు అధికారుల దగ్గరకు రావాలి. చిన్న సమస్యల కోసం రైతులను తిప్పించుకోకుండా పరిష్కరించాలన్నదే నా ఉద్దేశం. అందుకే ధరణిలో ఇష్యూస్ పరిష్కారం కోసం అప్లికేషన్లు రిజెక్ట్ కాకుండా, వారికి ముందుగానే హెల్ప్ డెస్క్ ద్వారా గైడెన్స్ ఇస్తాం. ఆ తర్వాత పని కంప్లీట్ చేసి పాస్ బుక్ రైతుల ఇంటికి పంపేలా చూస్తాం. ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ అయితే దానికి కారణాన్ని కూడా హెల్ప్ డెస్క్‌లో వివరిస్తారు.
ముజామ్మిల్ ఖాన్, కలెక్టర్, ఖమ్మం