నమస్కారం.. బాగున్నారా..  నేను మీ జిల్లా కలెక్టర్​ను!

నమస్కారం.. బాగున్నారా..  నేను మీ జిల్లా కలెక్టర్​ను!
  • ఉన్నట్టుండి రోడ్డు పక్కన ప్రత్యక్షమైన ఖమ్మం కలెక్టర్​ ముజమ్మిల్​ ఖాన్
  • ఆటో డ్రైవర్లు, వ్యాపారులతో మాటామంతీ
  • సర్కారు అందిస్తున్న స్కీముల గురించి అవగాహన

ఖమ్మం, వెలుగు: ఖమ్మం కలెక్టర్​ ముజమ్మిల్ ఖాన్​ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఖమ్మం నగరంలో ఆటో డ్రైవర్లు, ఫుట్ పాత్  పక్కనే చిన్న షాపుల్లో వ్యాపారాలు చేసుకునే వారితో మాట్లాడారు. ‘నమస్కారం, బాగున్నారా, నేను మీ జిల్లా కలెక్టర్ ను, ఎలా నడుస్తున్నది వ్యాపారం, ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ఆటో నడుపుతారు’ అంటూ ఆటో డ్రైవర్లతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఖమ్మం పాత బస్టాండ్ కు ఆనుకొని షాదీఖానా వెళ్లే రోడ్డులో ఉన్న ఫుట్ వేర్  షాప్ లోకి వెళ్లి వ్యాపారం ఎలా నడుస్తున్నది, రోజువారీ సంపాదన, కుటుంబ పోషణ, పిల్లల చదువు నేపథ్యం మొదలైన వివరాలు షాప్  ఓనర్​ సయ్యద్  బిలాల్ పాషాను అడిగి తెలుసుకున్నారు.

చెప్పుల స్టాక్  ఎక్కడి నుంచి తెస్తారు, దానికి పెట్టుబడి ఎలా వస్తుంది అనే వివరాలు అడిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, ముద్ర స్కీమ్​ ద్వారా తక్కువ వడ్డీతో పెట్టుబడి కోసం రుణాలు పొందవచ్చని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్  సూచించారు. తర్వాత బస్టాండ్  సిగ్నల్  ప్రాంతం మూల మీద ఆగి ఉన్న ఆటో స్టాండ్  వద్దకు వెళ్లి ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. రోజుకు ఎంత సంపాదిస్తున్నారు? కుటుంబ పోషణకు సరిపోతున్నాయా? ఆటో సొంతందా? కిరాయికి తెచ్చుకున్నారా? వంటి వివరాలు తెలుసుకున్నారు.

కలెక్టర్ గా మీరే మా వద్దకే వచ్చి మాకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడగడం చాలా సంతోషంగా ఉందని తెలిపిన ఆటో డ్రైవర్లు, ఖమ్మం నగరంలో 3 వేల వరకు ఆటోలు ఉంటాయని, ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్  సౌకర్యం కల్పించాలని, ఆటో అడ్డాలు పెంచాలని, వసతులు కల్పించాలని కలెక్టర్ ను కోరారు. జిల్లాలో పనిచేసే మున్సిపల్ కార్మికులు, పంచాయతీ వర్కర్లకు ఇటీవల ఇన్సూరెన్స్  కల్పించామని, ఆటో డ్రైవర్లు ప్రతి ఏడాది ఆర్టీవో దగ్గర రెన్యువల్  చేసే సమయంలో కొంత మొత్తం చెల్లించడానికి ముందుకు వస్తే, ఆటో డ్రైవర్లకు కూడా ఇన్సూరెన్స్  కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తామని, దీనిపై త్వరలో జిల్లా స్థాయిలో ఆటో సంఘం అధ్యక్షులు, కార్యదర్శులతో చర్చిస్తామని కలెక్టర్  తెలిపారు.

ఆటో అడ్డాల దగ్గర తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. అనంతరం పిల్లల చదువుల గురించి కలెక్టర్  అడిగి తెలుసుకున్నారు. తమ పిల్లలు  ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాల్లో చదువుతున్నారని తెలపగా, పిల్లలు ఎలా చదువుతున్నారు? టీచర్లు జవాబుదారీ తనంతో ఉన్నారా? పేరెంట్, టీచర్స్  మీటింగ్ లకు  హాజరవుతున్నారా? వంటి వివరాలపై ఆరా తీశారు. పేరెంట్, టీచర్స్ మీటింగ్ లకు రెగ్యులర్ గా హాజరు కావాలని, ఏవైనా లోపాలు ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్యం ఎలా అందుతుంది? అవసరమైన మందులు ఇచ్చారా?

వంటి వివరాలు తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తనను కలెక్టరేట్ కు వచ్చి కలవాలని, సమస్యల పరిష్కారానికి వీలైనంత వరకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కలెక్టర్​ స్వయంగా తమ వద్దకు వచ్చి పలకరించడంతో చిరు వ్యాపారులు సంబరపడ్డారు. గతంలో ఇలా ఎవరూ తమ వద్దకు వచ్చి మాట్లాడలేదని చెబుతున్నారు.