ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం టౌన్,వెలుగు :  ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని  కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్  అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లో   నిర్వహించిన ప్రజావాణి  లో  అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి  అర్జీలను స్వీకరించారు. అర్జీలను  పెండింగ్ లో  ఉంచొద్దని చెప్పారు. 

లోన్ల పంపిణీ

బ్యాంకుల ద్వారా ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావాలని  కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం ఆయన ముస్తఫానగర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను ప్రారంభించారు.   అనంతరం   25 మంది లబ్ధిదారులకు పీఎం విశ్వకర్మ కింద 22 లక్షల 50 వేలు, ప్రధానమంత్రి ఉపాధి కల్పన క్రింద 11 మంది లబ్ధిదారులకు కోటి 75 లక్షలు, 124 స్వ శక్తి సంఘాల మహిళలకు 21 కోట్ల 56 లక్షల 50 వేల బ్యాంకు లింకేజ్ రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ‌‌ఈ కార్యక్రమంలో డీజీఎం ఏ. హనుమంత రెడ్డి, ఏజీఎం లు టి. సర్వేష్, ఎన్. సుధాకర్ రావు, చీఫ్ మేనేజర్ ఆర్‌‌. రాజా ప్రసాద్, బ్రాంచ్ మేనేజర్ షేక్ సల్మా పర్వీన్  పాల్గొన్నారు.

  మహిళల మార్ట్​ పనుల పరిశీలన  

  సీక్వెల్ రోడ్డులో  మహిళా మార్ట్​ బిల్డింగ్​ను    అదనపు కలెక్టర్ డాక్టర్. పి. శ్రీజ తో కలిసి  కలెక్టర్​ పరిశీలించారు.   మార్ట్  ఎదుట పార్కింగ్ ఉండాలని,  స్లైడింగ్ గేట్ ఏర్పాటుచేయాలని చెప్పారు.  మొదటిసారి  మహిళలతో రిటైల్స్ స్పేస్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇది ప్రారంభం అయిన తర్వాత   నగరంలో మరి కొన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ  సన్యాసయ్య, పీఆర్ ఈఈ వెంకట్ రెడ్డి  పాల్గొన్నారు.