
ఖమ్మం టౌన్, వెలుగు : మున్నేరు నది కిరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు భూసేకరణ, నిర్మాణ పనులు స్పీడప్ చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి మున్నేరు రిటైనింగ్ వాల్ కోసం భూసేకరణ పురోగతి, వాల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. జూలై లోపు పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వాల్ నాణ్యతగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, ఈఈ అనన్య, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ రవికుమార్, ఆర్ఐ వహీద్ తదితరులు పాల్గొన్నారు.
బాలికలు గొప్ప లక్ష్యాలు నిర్ధేశించుకోవాలి
బాలికలు భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా గొప్ప లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో ‘బేటీ పడావో బేటీ బచావో’ పోస్టర్లను ఆవిష్కరించారు. మద్దతుగా నిర్వహిస్తున్న క్యాంపెయిన్ ఫ్లెక్సీ పై సంతకం చేశారు. కొణిజర్ల మండలం తనికెళ్ల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థినులు కలెక్టరేట్ కు వచ్చి కలెక్టర్ ను కలిసి ముచ్చటించారు.
కలెక్టరేట్ లో సుమారు 62 శాఖలు విధులు నిర్వహిస్తున్నాయని, అధికారులు తమ తమ శాఖల కార్యకలాపాలు చేపట్టడంతో జిల్లాలో అధికార యంత్రాంగం సజావుగా నడుస్తుందని ఆయన స్టూడెంట్స్కు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, డీఆర్వో ఎం. రాజేశ్వరి, కలెక్టరేట్ ఏవో ఎన్. అరుణ, సూపరింటెండెంట్ కె. శ్రీనివాసరావు, డీఎంసీ డీహెచ్ఈడబ్ల్యూ ఎస్డీ సమ్రిన్, అధికారులు పాల్గొన్నారు.