ప్రతీ ఆడపిల్లను ఉన్నత చదువులు చదివించాలి : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ప్రతీ ఆడపిల్లను ఉన్నత చదువులు చదివించాలి : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : బిడ్డ పుట్టిన తల్లిదండ్రులు అదృష్టమంతులని, ప్రతీ ఆడపిల్లను ఉన్నత చదువులు చదివించాలని ఖమ్మం కలెక్టర్​ ముజమ్మిల్​ఖాన్​ సూచించారు. ‘మా పాప- మా ఇంటి మణిదీపం’ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఆడపిల్లకు జన్మనిచ్చిన ఖమ్మం పట్టణం సారథినగర్ లోని మౌనిక-, సురేశ్​దంపతులను బుధవారం ఆయన సన్మానించారు. పండ్లు, స్వీట్లు, దుస్తులు, బర్త్​ సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మాయి ఆశించిన మేరకు చదువుకున్న తర్వాత ఉద్యోగం లేదా వ్యాపారంలో స్థిరపడ్డాక పెళ్లి గురించి ఆలోచించాలన్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలి 

మెరుగైన సేవలతో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలని కలెక్టర్ అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో జిల్లా ప్రధాన ఆస్పత్రిలో వసతులు, వైద్య కళాశాలలో సౌకర్యాలపై అడిషనల్​కలెక్టర్ డాక్టర్​ పి. శ్రీజతో కలిసి సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కావాల్సిన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ పై నియమించాలని చెప్పారు. 

పనులు స్పీడప్​చేయాలి 

పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సూచించారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, అటవీ, రెవెన్యూ భూముల సమస్యలపై అటవీ, రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికాబద్ధచర్యలు చేపట్టామన్నారు. పులిగుండాల ఎకో టూరిజం అభివృద్ధి పనులు, జమలాపురం ఎకో టూరిజం పార్క్ పనులు ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలిపారు.  వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 

సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్క్ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.  సీఏ భూముల అప్పగింతలో సమస్యలు రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లాలో 23 వైల్డ్ లైఫ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గిరిజనులకు ఆర్వోఎఫార్ పట్టాలు ఇచ్చిన చోట బోర్లు మంజూరు చేసినట్లు చెప్పారు. అనంతరం పులిగుండాల ఎకో టూరిజంపై రూపొందించిన పాంప్లెట్స్​ను కలెక్టర్ ఆవిష్కరించారు. 

పోటీ పరీక్షలపై అవగాహన 

నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో అభిరామ్ ఐఏఎస్ అకాడమి ఆధ్వర్యంలో పోటీ పరీక్షలపై యువతకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. సివిల్ సర్వీసెస్ ద్వారా మరింత మెరుగ్గా సమాజం మార్పు సాధ్యం చేయవచ్చని తెలిపారు. పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే మేధాశక్తి కన్నా పట్టుదల, ధైర్యం చాలా అవసరమన్నారు. అనంతరం అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి కలెక్టరేట్ ఆవరణలోని ఇవీఎం గోడౌన్ ను తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘాతో భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 

అలాగే గట్టయ్య సెంటర్ లోని రోటరీ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్, ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. దివ్యాంగులకు కృత్రిమ పాదాలను జైపూర్ టెక్నాలజీ తో గత 15 ఏండ్లుగా  ఉచితంగా అందిస్తున్నామని రోటరీ కమ్యూనిటీ సర్వీస్​ సెంటర్​ చైర్మన్ మల్లాది వాసుదేవ్ తెలుపగా, అవసరమైన తోడ్పాటును  అందిస్తామని కలెక్టర్​ హామీ ఇచ్చారు. జూబ్లిపురలోని పాత జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయ భవనంలో ఉన్న ప్రాంతీయ న్యాయ వైజ్ఞానిక శాస్త్ర ప్రయోగశాలను కలెక్టర్ సందర్శించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ పని తీరును సైంటిఫిక్ అధికారిణి డాక్టర్​వి. నాగలక్ష్మి, జిల్లా కలెక్టర్ కు వివరించారు.