హార్వెస్ట్​ ఎక్కి వరికోత పరిశీలించిన కలెక్టర్​ ముజామ్మిల్ ఖాన్

తల్లాడ, వెలుగు : ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సోమవారం తల్లాడ నుంచి మంగాపురం వెళ్లే రోడ్డు వెంట ఉన్న పంట పొలాలను పరిశీలించారు. వరి కటింగ్ చేస్తున్న హార్వెస్టర్ వద్దకు వెళ్లి డ్రైవర్ తో మాట్లాడారు. స్వయంగా కలెక్టర్ హార్వెస్టర్ ఎక్కి వరి కటింగ్ విధానాన్ని పరిశీలించారు. పొలం గట్లపై కూర్చొని రైతులతో మాట్లాడారు.

 సమస్యలు తెలుసుకుంటూనే పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఆయిల్ పామ్ సాగు చేస్తే దిగుబడి బాగుంటుందని సూచించారు. అనంతరం అంజనాపురం గ్రామంలోని చేతివృత్తులదారులతో మాట్లాడారు. హస్త కళాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.  

తహసీల్దార్ ఆఫీస్ లో ప్రజావాణి

తల్లాడ తహసీల్దార్​కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్​ హాజరయ్యారు. తల్లాడ మండలం నుంచి తనకు ఎక్కువ అర్జీలు వస్తున్నాయని, ఇక్కడ పరిష్కరించడం లేదా అని ఇన్​చార్జి తహసీల్దార్ వనజను ప్రశ్నించారు. అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. హాస్టళ్లలో, స్కూళ్లలో తరుచూ తనిఖీలు చేపట్టి క్వాలిటీ ఫుడ్​ అందేలా చూడాలన్నారు

అంబులెన్స్ అందించడం ప్రశంసనీయం 

ఖమ్మం టౌన్, వెలుగు :  సామాజిక బాధ్యతతో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి  యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు అంబులెన్స్ అందించడం అభినందనీయమని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. యూనియన్ బ్యాంక్ సోషల్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి ఏర్పాటు చేసిన అంబులెన్స్ ను  ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజేశ్వర్ రావు, ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, బ్యాంక్ ఏజీఎమ్ సర్వేశ్, ఏజీఎమ్ సుధాకర్ రావు, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 

 నేడు, రేపు ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు

నేడు, రేపు ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 26న ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో, 27న ఖమ్మం రూరల్ మద్ది ఎల్లారెడ్డి ఫంక్షన్ హాలులో విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.