ఇండ్ల పంపిణీకి లబ్ధిదారులను ఎంపిక చేయాలి : కలెక్టర్​ ముజామ్మిల్​ఖాన్​

ఇండ్ల పంపిణీకి లబ్ధిదారులను ఎంపిక చేయాలి : కలెక్టర్​ ముజామ్మిల్​ఖాన్​

ఖమ్మం టౌన్, వెలుగు :  జిల్లాలో నిర్మాణాలు, వసతులు పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక త్వరగా కంప్లీట్​ చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో డబుల్ బెడ్ రూమ్​ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 135 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పనులు పూర్తై పంపిణీకి  సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటికి వెంటనే అర్హుల జాబితా నుంచి దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, నిరుపేద వారు ప్రాతిపదికన జాబితా ఎంపిక చేసి శనివారం లోపు అందజేయాలని చెప్పారు. ఖమ్మం అర్బన్ లో నిర్మాణాలు పూర్తయి కేటాయింపుకు సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నాలుగు ఇండ్లను ట్రాన్స్​జెండర్లకు ఇవ్వాలని సూచించారు. 

నిర్మాణాలు పూర్తయి, లబ్ధిదారులకు అందజేతకు సిద్ధంగా ఉండి, అర్హుల జాబితా సిద్ధం కాని ఇండ్లు 470 ఉన్నాయని, వీటికి స్వీకరించిన దరఖాస్తుల విచారణ పూర్తి చేసి, జాబితాను రెండు వారాల్లో ఇవ్వాలని ఆదేశించారు. ఇండ్ల నిర్మాణాలు పూర్తయి, కనీస సౌకర్యాలు కల్పించాల్సిన ఇండ్లు 635 ఉన్నాయని, వీటి కోసం కావాల్సిన నిధులకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఈ సమీక్షలో అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీఆర్డీవో సన్యాసయ్య, డీఆర్వో రాజేశ్వరి, హౌజింగ్ ఈఈ శ్రీనివాస రావు, ఆర్ అండ్ బీ ఎస్ఈ హేమలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

క్రీడల్లో గెలుపోటములు సహజం

క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో ఆడిన వారే భవిష్యత్‌లో రాణిస్తారని కలెక్టర్‌ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం సర్ధార్ పటేల్ స్టేడియంలో వసతిగృహాల విద్యార్థులకు జిల్లా స్ధాయిలో నిర్వహించిన క్రీడల్లో విజేతలకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి జి. జ్యోతి, జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల అధికారి సునీల్ రెడ్డి పాల్గొన్నారు.