- మార్కెటింగ్ అధికారులకు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వార్నింగ్
- ఖమ్మం పత్తి మార్కెట్ యార్డులో ఆకస్మిక తనిఖీ
- రైతులకు మద్దతు ధర దక్కకపోవడంపై ఆగ్రహం
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం పత్తి మార్కెట్ యార్డులో ధరల పతనంపై కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సీరియస్ అయ్యారు. రైతులకు మద్దతు ధర దక్కకపోతే మీరెందుకు ఉన్నారని మార్కెటింగ్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయకపోతే మీ అందరి జాబ్ లు పోతాయంటూ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం పత్తి మార్కెట్ యార్డును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మెషీన్ లో పత్తిలో తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కు రైతులు తమ సమస్యలు చెప్పుకున్నారు. మద్దతు ధర కంటే తక్కువ రేటుకు కొనుగోలు చేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏ వ్యాపారైనా కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తే.. వెంటనే అతనికి నోటీస్ జారీ చేయాలని డీఎంవోను ఆదేశించారు. మరోసారి అలాగే చేస్తే లైసెన్స్ రద్దు చేయాలని హెచ్చరించారు. మద్దతు ధరకంటే తక్కువకు కొనుగోలు చేసే హక్కు ఎవరిచ్చారని అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు.
పత్తి తేమశాతం 8 –14 శాతం వరకు వస్తే వ్యాపారులను ఒప్పించి కొనుగోలు చేయిస్తామని కలెక్టర్ తెలిపారు. 20 నుంచి 25 శాతం ఉంటే కొనుగోలు సాధ్యం కాదని, రైతులు కూడా సహకరించాలని కోరారు. ఆరుగాలం పండించి పంటలు అమ్ముకునే రైతులను తేమశాతం పేరుతో మోసగిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. రైతులకు మద్దతు ధరలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని స్పష్టంచేశారు. కలెక్టర్ తిరిగి వెళ్లే క్రమంలో ఒకరిద్దరు రైతులు కారుకు అడ్డుపడబోయారు. కలెక్టర్ కారు దిగి సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను. ఇలా చేయడం సరికాదని రైతులకు నచ్చజెప్పారు.