
ఖమ్మం టౌన్, వెలుగు: మహిళలను గౌరవిస్తూ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భేటీ బచావో, భేటీ పడావో పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం బాలసదనం చిన్నారులు, విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన స్టూడెంట్లకు ప్రశంసాపత్రాలు, మెమోంటోలను డీఆర్‌ఓ పద్మశ్రీ అందజేశారు. గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆర్.ఐ.ఎన్.ఎల్. సంస్థ అందించిన అంబులెన్స్ ను కలెక్టర్ ప్రారంభించారు. కామేపల్లి, కారేపల్లి మండలంలోని గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను అంబులెన్స్ అందించడం చాలా సంతోషకరమని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కళావతి బాయి పాల్గొన్నారు.
యాసంగి పంటలకు సాగునీరివ్వాలి
కూసుమంచి: వేసవిలో యాసంగి పంటలకు ఇబ్బంది లేకుండా సాగునీటిని విడుదల చేయాలని ఖమ్మం కలెక్టర్ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. గురువారం కూసుమంచి మండలంలో పాలేరు జలాశయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్, రెవెన్యూ అగ్రికల్చర్ఆఫీసర్లతో మాట్లాడారు. ఒక్క ఎకరంలో కూడా పంట ఎండిపోకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఐబీ డీఈ రత్నకుమారి,తహసీల్దారు కరుణశ్రీ, ఏడీఏ సరిత,ఏవో వాణి తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ డ్రిప్ పద్ధతిలో పండించాలి
ఖమ్మం రూరల్: మండలంలో తల్లంపాడు, గుదిమళ్ల గ్రామాల్లో గురువారం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ పర్యటించారు. రైతులు పండిస్తున్న పంటలను సందర్శించారు. 18వ తేదీలోగా నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఆయిల్ పామ్ పంటలను డ్రిప్ ద్వారా పండించాలన్నారు. పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలని సూచించారు. రైతులతో పాటు వ్యవసాయ సహాయ సంచాలకులు బి. సరిత తదితరులు పాల్గొన్నారు.