ఇందిరమ్మ ఇండ్ల యాప్ పై అవగాహన కల్పించాలి : ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

ఖమ్మం టౌన్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల యాప్ పై అధికారులకు సంపూర్ణ అవగాహన కలిగేలా శిక్షణ ఇవ్వాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల యాప్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి జిల్లాకు ఇందిరమ్మ ఇండ్ల యాప్ లాగిన్ ఐడీలు ఇచ్చారని తెలిపారు. మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీవో లు, మున్సిపల్ కమిషనర్లకు శిక్షణ ఇచ్చి, వారి ద్వారా పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులకు శిక్షణ ఏర్పాట్లు చేయాలన్నారు.

జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం కింద స్వీకరించిన దరఖాస్తుల్లో 3,57,869 దరఖాస్తులు ఇండ్ల కోసం వచ్చాయని, ఇందులో కేఎంసీ పరిధిలోనే 53,990 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. రోజుకు ఒక అధికారి  కనీసం 40 దరఖాస్తుల పరిశీలన లక్ష్యంగా చేపట్టి, ఈ నెల 20 లోపు విచారణ పూర్తయ్యేలా కార్యాచరణ చేయాలన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ అసిస్టెంట్​ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, డీఆర్వో రాజేశ్వరి, జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీఆర్డీవో సన్యాసయ్య, డీపీవో ఆశాలత, హౌజింగ్ ఈఈ శ్రీనివాసరావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కె. శ్రీనివాసరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.