సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేక వైద్య సేవలు : ముజామ్మిల్​ ఖాన్​

 సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేక వైద్య సేవలు : ముజామ్మిల్​ ఖాన్​
  • ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్​ ఖాన్​ 

ఖమ్మం టౌన్, వెలుగు :  సీనియర్ సిటిజన్స్ కు జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక ప్రాధాన్యతతో ఒకేచోట వివిధ వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో సీనియర్ సిటిజన్ల కోసం  ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య సేవల విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే వయో వృద్ధులకు సీనియర్ సిటిజన్ వైద్య సేవల విభాగం ద్వారా సంపూర్ణ సేవలు అందించాలన్నారు. 

వృద్ధుల కోసం హెల్పర్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ విభాగంలో ప్రత్యేకంగా ఓపీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో అవసరమైన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ ద్వారా రిక్రూట్​మెంట్ కు ప్రతిపాదనలు అందించాలన్నారు. ఫార్మసీ ఇంటర్న్ షిప్ కింద విధులు నిర్వహించే విద్యార్థులకు కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టాలని ఆదేశించారు.

 ఆస్పత్రికి నలుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను కేటాయిస్తామని,  అత్యధికంగా అవసరమున్న చోట వీరి సేవలను  వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ఎస్. రాజేశ్వర రావు, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్. కిరణ్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఇందిర, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 డిస్పెన్సరీ సోమ్లా నాయక్, సూపర్​వైజర్ పద్మావతి, డాక్టర్. సతీశ్, డ్యూటీ డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కాగా డిసెంబర్ 1, 2న ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.