
ఖమ్మం టౌన్, వెలుగు : మహిళల జీవితాల్లో మార్పు దిశగా ఖమ్మం జిల్లాలో అడుగులు పడ్డాయని, భవిష్యత్‌లో మహిళల అభివృద్ధికి మరింత మెరుగ్గా పని చేయాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ మహిళా సమాఖ్య సభ్యులకు సూచించారు. శుక్రవారం స్థానిక టేకులపల్లిలో నిర్వహించిన గౌతమి జిల్లా మహిళా సమాఖ్య సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్ పేషెంట్ కోసం నిర్దేశించిన సమయంలో డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. డాక్టర్లు ఇన్‌టైంలో విధులకు హాజరవుతున్నారో.. లేదో గమనించి తమకు తెలియజేయాలని మహిళా సమాఖ్య సభ్యులకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేషెంట్లను ఎవరైనా ప్రైవేట్ క్లినిక్ కు రిఫర్ చేయడం, లింగనిర్ధారణ చేసి అబార్షన్లు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇలాంటి సమాచారం అందించినవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి యూనిట్లు, మహిళా డెయిరీ, మహిళా మార్ట్ ఏర్పాటుతో జిల్లాలో మహిళా సాధికారతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. డీసీపీఓ విష్ణువందన, డీఎంసీ డీహెచ్ఈడబ్ల్యూ సమ్రీన్ బేటి బచావో బేటి పడావో కార్యక్రమం కింద చేపట్టే పనులను తెలిపారు. జిల్లాలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా చేస్తున్న పనులను మహిళా సమాఖ్య సభ్యులకు వివరించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ ఎడ్యుకేటర్ అన్వర్ సీజన్ వ్యాధుల పట్ల తీసుకుంటున్న చర్యలను తెలిపారు. బేటి బచావో.. బేటి పడావో ప్రారంభించి 10 ఏండ్లు అవుతున్న సందర్భంగా వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం పదవి విరమణ పొందుతున్న 15 మంది అధికారులు, సిబ్బంది కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. గత 25 నుంచి 30 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తూ ప్రజలకు సేవలందించిన ఉద్యోగులకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.
టీచర్లకు శిక్షణ షురూ..
స్థానిక ఎన్నెస్పీ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యా శాఖ ఆధ్వర్యంలో డీఎస్సీ 2024 ద్వారా ఇటీవల నియామకమైన ప్రభుత్వ టీచర్ల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఆధునిక విద్యలో మార్పులను అవగతం చేసుకొని ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల జీవితాలలో స్పష్టమైన మార్పు సాధించే దిశగా టీచర్లు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు.