లక్ష్యసాధనకు వైకల్యం అడ్డు కావద్దు : కలెక్టర్​ ముజామ్మిల్​ ఖాన్​ 

లక్ష్యసాధనకు వైకల్యం అడ్డు కావద్దు : కలెక్టర్​ ముజామ్మిల్​ ఖాన్​ 
  • దివ్యాంగుల జిల్లా స్థాయి ఆటల పోటీలను ప్రారంభంలో కలెక్టర్​ ముజామ్మిల్​ ఖాన్​ 

ఖమ్మం టౌన్, వెలుగు :  వైకల్యం లక్ష్యసాధనకు అడ్డుకావద్దని, ఆత్మస్థైర్యం, పట్టుదలతో ముందుకు వెళ్లాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. డిసెంబరు 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల ఆటల పోటీలను కలెక్టర్​ జెండా ఊపి ప్రారంభించారు.

క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రతి ఒక్క దివ్యాంగుడినీ  పలకరిస్తూ, సెల్ఫీలు దిగుతూ వారిని ఉత్సాహపరిచారు. అనంతరం దివ్యాంగులకు కలెక్టర్ భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల అధికారి సునీల్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

ధాన్యం కొనుగోళ్లు స్పీడప్​ చేయాలి 

ధాన్యం కొనుగోళ్లు స్పీడప్​ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. కొనుగోలు చేసిన ధాన్యం, ట్యాబ్ ఎంట్రీలో నమోదు చేసిన ధాన్యం వివరాలకు ఉన్న వ్యత్యాసానికి గల కారణాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలని ఆదేశించారు. రానున్న మూడు వారాల్లో ధాన్యం ఎక్కువ పరిమాణంలో  రానున్నదని, కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు అలర్ట్​గా ఉంటూ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. 

ప్రజావిజయోత్సవాల కార్యక్రమం వాయిదా

మధిర : ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు లో నవంబర్ 24న జరిపేందుకు నిర్ణయించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమం 25కు వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సక్సెస్​ చేయాలని పిలుపునిచ్చారు.