ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి : కలెక్టర్​ ముజామ్మిల్​ఖాన్​

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి : కలెక్టర్​ ముజామ్మిల్​ఖాన్​
  • కలెక్టరేట్ లోని పలు సెక్షన్లను ఆకస్మికంగా తనిఖీ 

ఖమ్మం టౌన్,వెలుగు :  ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ప్రభుత్వ సిబ్బంది విధులు నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ లోని వివిధ కార్యాలయాలను, సెక్షన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు సమస్యలపై కలెక్టరేట్ కు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. 

కలెక్టరేట్ లో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన భోజనాల గదిని వినియోగించుకోవాలని సూచించారు. విధులకు సిబ్బంది సకాలంలో హాజరు కావాలన్నారు. నిరుపేదలైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లు మంజూరు అయ్యేలా చూడాలని హౌసింగ్ సెక్షన్ ఆఫీసర్లకు సూచించారు. ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులందరికీ పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. 

పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్ కు చర్యలు

పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్ కు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లో ఇందిరా మహిళా డెయిరీ, హాస్టళ్లలో చేయాల్సిన ఏర్పాట్లపై అడిషనల్​ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఆయన సమీక్షించారు. ఇందిరా మహిళా డెయిరీ స్థాపన, పాడి పశువుల యూనిట్లకు 250 లబ్ధిదారుల ఎంపిక, వివిధ అంశాల్లో అధికారులు బాగా పని చేశారని అభినందించారు. 

మండల కేంద్రాలలో బీఎంయూల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామన్నారు.  నిధులు మంజూరు కాగానే టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని, అంతలోపు స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పారు. శ్రీజ మాట్లాడుతూ ఇందిరా మహిళా డెయిరీకి సంబంధించి 500 పాడి పశువులను 250 యూనిట్లు గా గ్రౌండ్ చేసేందుకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశామన్నారు. వివిధ కార్పొరేషన్ల  ద్వారా లబ్ధిదారులకు రూ.1.40 లక్షల సబ్సిడీ , 60 వేల బ్యాంకు లింకేజీ రుణం మంజూరుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. 

అవగాహన కల్పించాలి

వ్యాపార విస్తరణ, లాభార్జనపై మహిళలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్​లో మహిళా మార్ట్, ఇందిరా మహిళా శక్తి అమలుపై అడిషనల్ కలెక్టర్ శ్రీజతో కలిసి అధికారులతో ఆయన సమీక్షించారు. మహిళా సంఘాలతో సమన్వయం చేసుకుంటూ స్వశక్తి మహిళా సంఘాలు తయారు చేసే సామగ్రిలను అమ్మేందుకు మహిళా మార్ట్ ఏర్పాటుకు ప్లాన్​ తయారు చేయాలని సూచించారు.  స్వశక్తి మహిళా సంఘాలు తయారు చేసే ప్రొడక్ట్ ప్యాకింగ్, వాటికి బ్రాండింగ్ కల్పించడంపై దృష్టి సారించాలన్నారు. ఖమ్మం జిల్లా బ్రాండింగ్ వచ్చేలా లోగో,  స్టిక్కరింగ్ డిజైన్ ఉండాలన్నారు.