పిల్లల భవిష్యత్​ను తీర్చిదిద్దాలి

పిల్లల భవిష్యత్​ను తీర్చిదిద్దాలి
  • టీచర్లతో ముఖాముఖిలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం టౌన్, వెలుగు: డీఎస్సీలో ఎంపికైన టీచర్లు పిల్లల జీవితాల్లో మార్పు తెచ్చేలా పని చేయాలని, వారి భవిష్యత్​ను తీర్చిదిద్దాలని కలెక్టర్  ముజమ్మిల్ ఖాన్ సూచించారు. శుక్రవారం భక్త రామదాసు కళాక్షేత్రంలో విద్యా శాఖ ఆధ్వర్యంలో డీఎస్సీ–2024 ద్వారా ఎంపికైన టీచర్లతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ఆలయాలతో సమానమని అన్నారు. 

సగటు మనిషి జీవితాన్ని ప్రభావం చేసే అవకాశం టీచర్లకే దక్కుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందని, దీనికి ముఖ్య కారణం సాధించిన ఫలితాలను ప్రచారం చేసుకోకపోవడం, ప్రభుత్వ పాఠశాలలపై జరిగిన తప్పుడు ప్రచారాలు మాత్రమేనన్నారు. వసతులు సరిగా లేకపోయినా, పిల్లలు, తల్లిదండ్రుల నుంచి స్పందన రాకపోయినా నిరుత్సాహ పడకుండా విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు. 

జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీఈవో సోమశేఖర శర్మ పాల్గొన్నారు. అనంతరం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి సైన్స్  సంబరాలు పోస్టర్​ను కలెక్టర్  రిలీజ్​ చేశారు. వేదిక ప్రతినిధులు నాగేశ్వరరావు, మోహన్, రామారావు, శివ నారాయణ, రాఘవయ్య పాల్గొన్నారు. స్థానిక బాల సదనం సందర్శించి సత్తుపల్లి సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్  కాలేజీలో బీటెక్  మొదటి సంవత్సరం చదువుతున్న కె. కావ్యకు ల్యాప్ టాప్  అందజేశారు.

మహిళ డెయిరీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి

జిల్లాలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా డెయిరీ ప్రాజెక్టును ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కలెక్టర్  ముజమ్మిల్ ఖాన్  సూచించారు. కలెక్టరేట్ లో ఇందిరా డెయిరీపై అడిషనల్​ కలెక్టర్  పి. శ్రీజతో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ ఎర్రుపాలెం మండలంలో పాల శీతలీకరణ యూనిట్  ప్రారంభించామని, ఇందిరా మహిళా డైరీ, ఎర్రుపాలెం మండల మహిళా సమాఖ్య గ్రామంలో పాలు సేకరించి విజయ డెయిరీకి తరలిస్తుందని తెలిపారు.

మధిర నియోజకవర్గంలో పాల ఉత్పత్తి పెంచేందుకు గేదె, గడ్డి షెడ్​ ఉన్న రైతులకు పాడి పశువులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాడి రైతులను ప్రోత్సహించే విషయంలో ముందుండాలని సూచించారు. డీఆర్డీవో సన్యాసయ్య,   లీడ్  బ్యాంక్​ మేనేజర్  శ్రీనివాస రెడ్డి, డీఏవో పుల్లయ్య, పశు సంవర్థక శాఖ అధికారి వేణు మనోహర్  పాల్గొన్నారు.