ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్స్​కు ఇంగ్లిష్​ నేర్పేందుకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్స్​కు ఇంగ్లిష్​ నేర్పేందుకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
  • ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్​ఖాన్​

ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్స్​కు ఇంగ్లిష్​ నేర్పేందుకు టీచర్లు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. శుక్రవారం మామిళ్లగూడెం జడ్పీహెచ్​ఎస్​లో స్టూడెంట్స్​కు టీచర్లు ఇంగ్లిష్​​ బోధిస్తున్న విధానాన్ని ఆయన పరిశీలించారు. ఈ  సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ఇంగ్లిష్​ లాంగ్వేజ్​ పట్ల భయం అవసరం లేదన్నారు. రోజూ ఒకరికొకరు కొంత సేపు ఇంగ్లిష్​లో మాట్లాడుకుంటే సులువుగా నేర్చుకోవచ్చని చెప్పారు.

స్టూడెంట్స్​ సులువుగా అర్థం చేసుకొని, మాట్లాడేలా ‘యూ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లిష్’ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలో అమలు చేస్తున్నామని తెలిపారు. స్కూల్​లో బాలికల టాయిలెట్ల నిర్వహణ పై శ్రద్ధ వహించాలన్నారు. స్కూల్​లో డైనింగ్ హాల్, ప్లే గ్రౌండ్ లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. 

భవనాల పరిశీలన.. ఆర్డీవోకు సన్మానం.. 

జిల్లా సైనిక సంక్షేమ అధికారి కార్యాలయాన్ని కలెక్టర్​ సందర్భించారు. భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. పాత బీఆర్డీవో కార్యాలయ భవనాలను పరిశీలించారు. వాటిని సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవలి బదిలీల్లో ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేస్తూ తొర్రూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా బదిలీపై వెళ్లిన జి. గణేశ్​ను కలెక్టర్ సన్మానించారు. 

పక్కాగా సమగ్ర కుటుంబ సర్వే..

ఈనెల 6 నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లాలో పక్కాగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్  సూచించారు. ఈ విషయమై కలెక్టరేట్​లో సర్వేకు సంబంధించి నియోజకవర్గ అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రతీ ఇంటిని పక్కాగా సందర్శించి ఎలాంటి తప్పులకు తావులేకుండా సర్వే చేపట్టాలని సూచించారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్​కలెక్టర్ డాక్టర్​పి. శ్రీజ, ముఖ్య ప్రణాళిక అధికారి ఏ. శ్రీనివాస్, డిప్యూటీ జడ్పీ సీఈవో నాగలక్ష్మి, ఆర్డీవోలు నర్సింహారావు, రాజేందర్, జిల్లా వైద్య శాఖ అధికారి సోమశేఖరశర్మ, అడిషనల్​ డీఆర్డీవో నూరొద్దీన్, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు,  తదితరులు ఉన్నారు.