- రఘునాథపాలెం మండలంలో పంటల పరిశీలన
ఖమ్మం టౌన్, వెలుగు : లాభదాయక ఆయిల్ పామ్ పంటను రైతులు సాగు చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. మంగళవారం రఘునాథపాలెం మండలం చింతగుర్తిలో ఆలస్యం రామారావు పండిస్తున్న ఆయిల్ పామ్ పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంట వేసేందుకు ప్రభుత్వం మొక్కల సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ, మొదటి నాలుగు సంవత్సరాల వరకు అంతర్ పంట పెట్టుబడులకు కొంత సబ్సిడీని అందిస్తుందని తెలిపారు.
గ్రామంలో అర ఎకరం వరకు లీజ్ కు ఇస్తామని, నెల రోజుల వ్యవధిలో క్లస్టర్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు చేసి అత్యాధునిక వ్యవసాయ పరికరాలు రైతులకు అందుబాటులోకి తీసుకు రావాలని అధికారులకు సూచించారు. రైతులకు సరఫరా చేసే ప్రతి ఆయిల్ పామ్ మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలన్నారు. గ్రామంలోని చెరువుల వద్ద శిఖం భూములు ఆక్రమణలకు గురయ్యాయని రైతులు ఫిర్యాదు చేయగా, ఆక్రమణలపై విచారణ చేసి ఫిబ్రవరి 15 లోపు నివేదిక అందించాలని తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్ పెక్టర్లను ఆయన ఆదేశించారు. కలెక్టర్వెంట ఉద్యానవన శాఖ అధికారి జి నగేశ్, రఘునాథపాలెం మండల తహసీల్దార్ విల్సన్, గోద్రెజ్ ఆగ్రో వెట్ లిమిటెడ్ మేనేజర్ ఏ. రామకృష్ణ, టీఎస్ఎంఐపీ నాగమణి ఉన్నారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి
మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా మహిళా మార్ట్ ఏర్పాటు ఉండాలని కలెక్టర్ అన్నారు. సీక్వెల్ రోడ్డులో మహిళా మార్ట్ ఏర్పాటు చేయనున్న భవనాన్ని ఆయన పరిశీలించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సమన్వయంతో గ్రామీణ మహిళా ఉత్పత్తులు అమ్మేందుకు వీలుగా మహిళా మార్ట్ ను ఖమ్మంలో ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా బ్రాండింగ్ వచ్చేలా లోగో, స్టిక్కరింగ్ డిజైన్ తయారు చేయాలని చెప్పారు. ఫిబ్రవరి 3వ వారంలోపు మహిళా మార్ట్ గ్రౌండ్ అయ్యేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో సన్యాసయ్య, అదనపు డీఆర్డీవో నూరొద్దీన్, ఇన్చార్జ్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్ బాబు, డీపీఎం దర్గయ్య పాల్గొన్నారు.
ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి
ఖమ్మం నగరంలో సాంస్కృతిక ప్రదర్శనలకు వేదికగా ఉన్న భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అన్నారు. నగరంలోని భక్త రామదాసు కళా క్షేత్రాన్ని ఆయన సందర్శించి పలు సూచనలు చేశారు. భక్త రామదాసు కళా క్షేత్రంలో ఇంటీరియర్ మరింత ఆకర్షణీయంగా తయారుచేయాలన్నారు.