- అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని వెల్లడి
- మున్సిపల్ కార్యకలాపాలపై సమీక్ష
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో అధికారులు బాధ్యతగా పని చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. గురువారం కేఎంసీ కార్యకలాపాలపై అడిషనల్కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. నగరంలో చాలా వరకు పారిశుధ్య సిబ్బంది లెక్కలు తప్పుగా నమోదవుతున్నాయని, పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇంటికి చెత్త బండి ఎప్పుడు వస్తుందనే షెడ్యూల్ తయారు చేయాలని, పారిశుధ్య సమస్యల కోసం సంప్రదించేందుకు మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ తో ఏర్పాటు చేయాలని చెప్పారు. అపరిశుభ్రంగా ఉండే ప్రాంతాలను, హాట్ స్పాట్ లకు జియో ట్యాగ్ చేయాలని, ప్రతినెలా కార్పొరేషన్ పరిధిలో 20 హాట్ స్పాట్ లను పూర్తి స్థాయిలో శుభ్రం చేసి, అక్కడ ముందు ఎలా ఉంది, తరువాత ఎలా ఉందో ఫొటోలు పెట్టాలని సూచించారు.
అక్రమ నిర్మాణాలపై సర్వే చేపట్టాలి
కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాల సర్వే చేపట్టాలని, పునాదుల దశ, స్లాబ్ దశ, నిర్మాణం పూర్తయిన అక్రమ నిర్మాణాల వివరాలు సేకరించాలని కలెక్టర్ తెలిపారు. అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అప్పుడే ఆపకుండా ఏం చేస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలు చేస్తున్న బిల్డర్లు, కాంట్రాక్టర్లను గుర్తించి వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్నారు.
అక్రమ హోర్డింగులు, ఫ్లెక్సీలపై భారీగా ఫైన్ విధించాలని ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ షఫీఉల్లా, మున్సిపల్ ఈఈ క్రిష్ణలాల్, ఏసీపీ వసుంధర, పర్యవేక్షకులు విజయానంద్, శానిటరీ సూపర్వైజర్ సాంబయ్య, రెవెన్యూ అధికారి జి. శ్రీనివాస రావు, సి సెక్షన్ పర్యవేక్షకులు కే. శ్రీనివాస రావు, బిల్డింగ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇంజినీరింగ్, అకౌంట్స్, మెప్మా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మానవతా దృక్పథంతో రూ.10 వేల చెక్కు
మానవతా దృక్పథంతో సొంత ఊరు వెళ్తున్న దాసరి రమాదేవి అనే మహిళకు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ రూ.10 వేల చెక్కును అందజేశారు. మానసిక సమస్యల నుంచి కోలుకున్న దాసరి రమాదేవి, తల్లి దాసరి కుమారి, కుటుంబ సభ్యులతో గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద కలెక్టర్ ను కలిశారు. ఏపీలోని ప్రకాశం జిల్లా పొంగులూరు గ్రామానికి చెందిన 35 ఏండ్ల రమాదేవి మతిస్థిమితం లేకుండా పెద్దగోపతి గ్రామంలో తిరుగుతుండగా, పోలీసు వారు ఆమెను అన్నం ఫౌండేషన్ కు అప్పగించారు.
రెండున్నర సంవత్సరాలుగా బాగోగులు చూస్తూ చికిత్స అందించడంతో ఇప్పుడు ఆమె కోలుకొని కుటుంబ వివరాలు తెలిపింది. అన్నం ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అన్నం శ్రీనివాసరావును కలెక్టర్ అభినందించారు.
ఇందిరా డెయిరీని లాభదాయకంగా నడపాలి
ఎర్రుపాలెం : ఇందిరా డెయిరీని లాభదాయకంగా నడపాలని కలెక్టర్ మహిళా సమాఖ్యకు సూచించారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలోని ఇందిరా డెయిరీని ఆయన సందర్శించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు డైయిరీని సొంత సంస్థలా అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. ఈ కార్యక్రడమంలో డీఆర్డీవో సన్యాసయ్య, డైయిరీ మేనేజర్ సిద్దేశ్వర్, తహసీల్దార్ ఉషా శారద, ఎంపీడీవో సురేంద్ర, డీపీఎం శ్రీనివాస్, ఏపీఎం వెంకటేశ్వర్లు, ఇందిరా డెయిరీ ఏపీఎం లక్ష్మణరావు, డెయిరీ అధ్యక్షురాలు అన్నపూర్ణ పాల్గొన్నారు.