- విద్యాశాఖ అధికారులతో ఖమ్మం కలెక్టర్ సమీక్ష
ఖమ్మం టౌన్, వెలుగు: గవర్నమెంట్ స్కూళ్లలో స్టూడెంట్స్ అటెండెన్స్‌ను నిలకడగా మెయిన్ టైన్ చేయడానికి పేరెంట్స్ మీటింగ్స్ ఎంతగానో ఉపయోపడతాయని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. విద్యాశాఖ అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కూళ్లలో టీచర్లు,హెచ్ ఎంలు బాధ్యత తీసుకుని స్టూడెంట్స్ సంఖ్యను పెంచేందుకు దృష్టి సారించాలన్నారు.
స్టూడెంట్ స్కూల్‌కు ఆబ్సెంట్ అయితే కారణాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి రోజూ స్టూడెంట్స్, టీచర్ల హాజరును జిల్లా స్థాయిలో మానిటర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. స్కూళ్లలో స్పోర్ట్స్ మీట్ నిర్వహించాలని సూచించారు. వారం రోజుల్లో జిల్లాలోని అన్ని స్కూళ్లలో తప్పనిసరిగా బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలని చెప్పారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ముజామ్మిల్ ఖాన్‌కు బొకే అందజేసి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. సమీక్షలో డీఈవో సోమశేఖర శర్మ, సీఎంవో రాజశేఖర్, ఏఎంవో రవికుమార్, కో ఆర్డినేటర్లు రామకృష్ణ, భూలక్ష్మి,భాను ప్రకాష్, పాపారావు, డీఎస్వో జగదీష్, ఎంఈవోలు పాల్గొన్నారు.
ప్రభుత్వ హాస్పిటల్, స్కూల్ తనిఖీ
జిల్లా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్‌ను కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జనరల్, శస్త్ర చికిత్స విభాగాలు, ప్రసూతి వార్డులను సందర్శించి సేవలు సరిగ్గా అందుతున్నాయా లేదా అని రోగులు, వారి బంధువులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల ను తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, నమోదు సంఖ్యపై ఆరా తీశారు.