ఎర్రుపాలెం, వెలుగు : ఇందిరా డెయిరీ ద్వారా మహిళలు అభివృద్ధి చెందాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. మిల్క్ చిల్లింగ్ సెంటర్ కోసం మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న పంచాయతీ భవనాన్ని కేటాయించాలన్నారు. మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి ప్రైవేట్ బిల్డింగ్ లో నడుస్తున్న చిల్లింగ్ సెంటర్ ను ఆయన పరిశీలించారు. అనంతరం మీనవోలు లోని నాలెడ్జి సెంటర్లో నిర్వహించిన సమాఖ్య సమావేశంలో ఇందిరా డెయిరీ పథకంపై అవగాహన కల్పించారు. మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడాలని పాడి పరిశ్రమ ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.
మండలంలో నాలుగు వేల మంది మహిళలు డెయిరీ ప్రాజెక్టులో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. వారంతా వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొని, వ్యాపారాన్ని దినదిన అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో మీసేవా కేంద్రాలు, ఈవెంట్ మేనేజ్మెంట్, డెయిరీ వ్యాపారాలు, క్యాంటీన్లు, బ్యూటీ పార్లర్ల ఏర్పాటు తదితర అన్నిరకాల ఉపాధి కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. మహిళలను అమ్మ ఆదర్శ పాఠశాలలకు చైర్ పర్సన్లుగా నియమించడంతోనే జిల్లాలో 85 శాతం పనులు పూర్తయ్యాయన్నారు.
అనంతరం నాలెడ్జి సెంటర్ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్, డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణు మనోహర్, డీఎల్డీవో కె.కిషోర్, అడిషనల్ డీఆర్డీవో మహ్మద్ నూరుద్దీన్, ఎర్రుపాలెం తహసీల్దార్ ఉషాశారద, ఎంపీడీవో సురేందర్, ఖమ్మం విజయ డెయిరీ మేనేజర్ సిద్ధేశ్వర్, గౌతమి జిల్లా సమైక్య అధ్యక్షురాలు టి. సుహాసిని, ఇందిరా డెయిరీ అధ్యక్షురాలు అన్నపూర్ణ, డీపీఎం, ఏపీఎంలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.