మున్నేరు రిటైనింగ్ వాల్ పనులు స్పీడప్ ​చేయాలి :  కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

మున్నేరు రిటైనింగ్ వాల్ పనులు స్పీడప్ ​చేయాలి :  కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

ఖమ్మం/ఖమ్మం రూరల్/వైరా, వెలుగు :  మున్నేరు నది కిరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు అవసరమైన భూ సేకరణతో పాటు, నిర్మాణ పనులు స్పీడప్​ చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. బుధవారం అడిషనల్​కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి,  రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి పోలేపల్లి వద్ద వాల్ నిర్మాణ పనులు, భూసేకరణ పురోగతి, భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చే స్థలం, మున్నేరు యాక్వీడేట్ ను పరిశీలించారు.

రోజూ ఎంత మేరకు పని జరగాలో ప్రణాళిక చేసి, పనులు పూర్తి చేసేందుకు అవసరమైన అదనపు బృందాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. మున్నేరు వాల్ కు ఆనుకొని రోడ్డు, దాని ప్రక్కన డ్రైనైజీ కాలువ నిర్మిస్తున్నామని తెలిపారు. వాల్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూమి ఇచ్చిలా రైతులతో చర్చలు జరుపుతున్నామన్నారు. వాల్ పనుల పురోగతిపై రోజువారి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, డీఈ రమేశ్, ఖమ్మం రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్, ఆర్ఐ క్రాంతి అధికారులు పాల్గొన్నారు. 

ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి 

ప్రజాస్వామ్య స్ఫూర్తి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మంలోని  కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి ప్రతిరూపమే పార్లమెంట్ వ్యవస్థ అన్నారు.

ప్రస్తుతం మన దగ్గర ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ దాదాపు 150 సంవత్సరాలకు పైగా చేసిన పోరాట ఫలితంగా వచ్చిందని, దాదాపు 5 నుంచి 6 కోట్ల మంది ప్రాణాలను అర్పించి స్వాతంత్ర్యం సాధించారని తెలిపారు.  ప్రపంచంలో మహిళలకు ముందుగా ఓటు హక్కు కల్పించింది భారతదేశమేనన్నారు.  ప్రజాస్వామ్యాన్ని సంరక్షించడంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 

పరీక్షలు ప్రశాంతంగా రాయాలి

పదో తరగతి విద్యార్థులు పరీక్షలపై భయం వీడి ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కలెక్టర్ సూచించారు. కొణిజర్ల మండలం తనికెళ్ల జడ్పీహెచ్​ఎస్​లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. టెన్త్ విద్యార్థులు ప్రణాళికా ప్రకారం పరీక్షకు సిద్ధమవ్వాలని సూచించారు.  పరీక్షలు అంటే భయం ఉండవద్దని, ఆందోళన చెందితే చదివింది కూడా మర్చిపోతామన్నారు.

రోజూ పౌష్టికాహారం తీసుకోవాలని, సరిపోను నిద్రపోవాలని సూచించారు. అనంతరం అదే పాఠశాలలో ‘వుయ్ కెన్ లెర్న్ ఇంగ్లీష్’ తరగతి నిర్వహణ, విద్యార్థులు ఇంగ్లీష్​ మాట్లాడుతూ గ్రూప్ గా ప్రదర్శించిన ప్రదర్శలను చూసి పలు సూచనలు చేశారు.