- ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది
- ట్రాన్స్ జెండర్లతో సమావేశమైన ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు : ట్రాన్స్ జెండర్లు ఆత్మగౌరవంతో జీవించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అడిషనల్కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తో కలిసి ట్రాన్స్ జెండర్లతో ఆయన మాట్లాడారు. ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి చర్యలు చేపడతామన్నారు. ఆధార్ కార్డులు లేనివారికి ఆధార్ కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు.
పేరు మార్చుకోవాలనుకుంటే చేయాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. రేషన్ కార్డు కోసం ట్రాన్స్ జెండర్లు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్, పథకం లేదని, ఒంటరి మహిళల కోటా కింద పెన్షన్ మంజూరుకు దరఖాస్తులు సమర్పిస్తే మంజూరుకు చర్యలు చేపడుతామని తెలిపారు.
స్వశక్తి మహిళా సంఘాల తరహాలో ట్రాన్స్ జెండర్లు సంఘాలుగా ఏర్పాటయితే వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు రుణాలు అందిస్తామని చెప్పారు. ఖమ్మం నగర పరిధిలో 13 చోట్ల స్త్రీ టీలను ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో 2 చోట్ల ట్రాన్స్ జెండర్లకు అవకాశం కల్పిస్తామని, మరో నాలుగు ఇతర వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందిస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.
జిల్లాలో 75.15 శాతం సర్వే పూర్తి
ఖమ్మం జిల్లాలో నవంబర్ 21 నాటికి 75.15 శాతం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తయినట్లు కలెక్టర్ తెలిపారు. సర్వే ఎన్యుమరేటర్లు ఖమ్మం కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని సర్వేలో భాగంగా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ కుటుంబ వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో హౌస్ లిస్టింగ్ చేసిన మొత్తం 5,67,338 ఇండ్లను సర్వే కోసం గుర్తించామన్నారు. నవంబర్ 21 నాటికి 4,129 ఎన్యుమరేటర్ బ్లాక్ పరిధిలో 4,26,333 ఇండ్ల సర్వే పూర్తయిందని చెప్పారు.
విద్యార్థుల ఆరోగ్యం పట్ల అలర్ట్గా ఉండాలి
ఖమ్మం రూరల్: వాతావరణ పరిస్థితిలో వస్తున్న మార్పు నేపథ్యంలో హాస్టళ్లలో చదువుతున్న పిల్లల ఆరోగ్యం పట్ల అధికారులు అలర్ట్గా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్ లోని మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీని ఆయన తనిఖీ చేశారు. రెసిడెన్షియల్ పాఠశాల, హాస్టల్ పరిసరాలు, ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
స్టూడెంట్స్కు తాజా కూరగాయలతో భోజనం అందించాలని చెప్పారు. వాతావరణంలో వస్తున్న మార్పులను గమనిస్తూ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. జింకల తండా వద్ద నిర్మించే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ లో ప్రస్తుతం అత్యవసర వసతులు కల్పించేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు.