డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ ముజామ్మిల్​ఖాన్​

డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ ముజామ్మిల్​ఖాన్​

 ఖమ్మం టౌన్, వెలుగు :  జిల్లాలో డ్రగ్స్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. ఈ విషయమై కలెక్టరేట్​లో గురువారం అడిషనల్ ​కలెక్టర్ డాక్టర్  పి. శ్రీజ తో కలిసి అధికారులతో సమీక్షించారు. రాబోయే  మూడు నెలల పాటు డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణ, వీటి వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రచారం నిర్వహిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు.  

వారానికి రెండు  విద్యా సంస్థలను సందర్శించి డ్రగ్స్​వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించాలని చెప్పారు.  డ్రగ్స్ వాడకం మనిషిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలిపే వీడియోలను వాట్సాప్ గ్రూప్ ల్లో షేర్​ చేయాలన్నారు. సోమవారంలోపు అవగాహన కార్యక్రమాల్లో ఏం మాట్లాడాలో నిపుణులతో మాట్లాడి ఫైనల్ చేయాలని ఆదేశించారు. డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు అనువైన భవనం గుర్తించాలన్నారు.

డ్రగ్స్ అలవాటు ఉన్న వారిని అక్కడ చేర్పించి నిర్వహణ బాధ్యతలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించేలా ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లీష్ కు అరగంట,  క్రీడలు ఆడేందుకు అరగంట షెడ్యూల్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డీఈవో సోమశేఖర శర్మ, డీడబ్ల్యూవో రాంగోపాల్ రెడ్డి, మధిర షేర్ ఎన్జీవో డైరెక్టర్ జి. గోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు గోపాల్ స్వామి, ఎం. హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు. 

మంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

డిసెంబర్ 6న జిల్లాకు రానున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. ఈ విషయమై గురువారం కలెక్టరేట్ లో అధికారులతో ఆయన సమీక్షించారు. 6న ఉదయం మంత్రి జిల్లా ఆసుపత్రి , మాతా శిశు సంరక్షణ కేంద్రం సందర్శిస్తారని తెలిపారు.

అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యరోగ్య శాఖ పని తీరుపై సమీక్ష ఉంటుందని చెప్పారు. వైద్యశాఖ పరిధిలో జిల్లాకు ఉన్న అవసరాల గురించి ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రాజేశ్వర రావు, డీఎంహెచ్​వో కళావతి బాయి, డీసీహెచ్ఎస్ డాక్టర్​ రాజశేఖర్,  అధికారులు, పాల్గొన్నారు.